Raja Singh: జైలులో నా భర్త ప్రాణాలకు ముప్పు... ప్రత్యేక వసతులు కల్పించండి: హైకోర్టులో ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య పిటిషన్

  • విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజా సింగ్
  • కేసును సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన భార్య ఉషాబాయి
  • తాజాగా రాజా సింగ్ కు ప్రత్యేక వసతుల కోసం పిటిషన్  
  • తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు
bjp mla raja singh wife files second petition in ts high court

విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్టయి జైలులో వున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తరఫున ఆయన భార్య ఉషాబాయి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె గురువారం మరో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తోటి ఖైదీల నుంచి తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని... ఈ నేపథ్యంలో తన భర్తకు ప్రత్యేక వసతులకు అవకాశం కల్పించాలని ఆమె తన పిటిషన్ లో హైకోర్టును కోరారు. 

జైలులో ఇతర ఖైదీలకు దూరంగా తన భర్తకు ఓ గదిని కేటాయించాలని ఉషాబాయి హైకోర్టును కోరారు. ప్రత్యేక గదితో పాటు అందులో మంచం, టేబుల్, కుర్చీ, వార్తా పత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన వసతులు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై గురువారమే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. తమ వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

More Telugu News