New Delhi: ఢిల్లీ, నోయిడాను ముంచెత్తిన వర్షాలు

  • రెండు రోజులుగా వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
  • రోడ్లపై నీళ్లు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ 
  • నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 
No relief for rain hit Delhi as IMD issues yellow alert

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవ్వడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురువారం భారీ వర్షాల కారణంగా ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గుర్గావ్-ఢిల్లీ సరిహద్దు సమీపంలోని జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో 3, 4 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వర్షాల నేపథ్యంలో శుక్రవారం నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. హర్యానాలో ప్రభుత్వ విపత్తు నిర్వహణ అథారిటీ..గుర్గావ్‌లోని కార్యాలయాలు, కార్పొరేట్‌లను శుక్రవారం ఇంటి నుంచి పని చేయమని ఉద్యోగులను కోరుతూ నోటీసును విడుదల చేసింది. ఢిల్లీలో పాఠశాలలకు సెలవుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, చాలా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇచ్చినట్టు తల్లిదండ్రులకు సందేశాలు వచ్చాయి. గుర్గావ్, ఫరీదాబాద్ జిల్లాల్లోనూ ఇదే విధంగా పలు ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి.

More Telugu News