Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి!

  • 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • అక్టోబరు 1న శ్రీవారి గరుడ సేవ
  • ఈ నెల 30 నుంచి అక్టోబరు 2 వరకు కొండపైకి వాహనాల నిలిపివేత
TTD big Announcement to devotees on Sri Vari Brahmotsavalu

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తజనం పోటెత్తే అవకాశం ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాల కోసం 5 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలను రెండేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తుండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ నిఘా, భద్రతా విభాగం అప్రమత్తమైంది. 

తిరుమలకు వెళ్లే వాహనాలు 12 వేలు దాటిన తర్వాత ఆపై ఒక్క వాహనాన్ని కూడా అనుమతించకూడదని నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లో వదిలేసి అక్కడి  నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని టీటీడీ సూచించింది. 

నిజానికి గరుడ సేవ నిర్వహించే రోజున ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అక్టోబరు 1న గరుడ సేవ నిర్వహించనుండడంతో ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించబోమని అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టీటీడీ కోరింది.

More Telugu News