Hyderabad: టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి: హెచ్ సీఏ ప్రకటన

Hyderabad Cricket Association announced that the tickets for the Sunday match were sold out
  • ఆన్ లైన్ లో టికెట్లు కొన్న వాళ్లు ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచన
  • నేటి నుంచి ఆదివారం వరకు జింఖానా మైదానంలో కౌంటర్లు ఏర్పాటు
  • బుకింగ్ కన్ఫర్మేషన్, ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని సూచన
ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయని చెప్పింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్లు ఈ-మెయిల్ కన్ఫర్మేషన్ చూపించడంతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలని, దాని జిరాక్స్ ను కూడా ఇచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఇతరులు బుక్ చేసిన టికెట్లను తీసుకోవాలంటే ఇద్దరి ఫొటో గుర్తింపు కార్డులు, జిరాక్సులను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. ఫిజికల్ టికెట్లు ఉంటేనే ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు అనుమతి ఉంటుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం స్పష్టం చేసింది. 

కౌంటర్లలో టికెట్లు విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రకటించడంతో గురువారం భారీ సంఖ్యలో జింఖానా మైదానం వద్దకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హెచ్ సీఏపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. చివరి నిమిషం వరకూ కౌంటర్లలో టికెట్ల విక్రయంపై సరైన ప్రకటన ఇవ్వకపోవడంతోపాటు జింఖానా మైదానం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందని పలువురు ఆరోపించారు.
Hyderabad
Cricket
t20 match
tiickets
sold
hca

More Telugu News