చిరంజీవిగా 44 ఏళ్లు... మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

22-09-2022 Thu 22:02
  • ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవిగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్
  • ఆ సినిమా రిలీజ్ అయి నేటికి సరిగ్గా 44 ఏళ్లు
  • ప్రేక్షకాభిమానుల రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోొలేనన్న చిరంజీవి
chiranjeevi emotional post on his cine career
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం తన జీవితంలో ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. తన అసలు పేరు స్థానంలో చిరంజీవి పేరుతో మొదలుపెట్టిన తన ప్రయాణం గురువారం (సెప్టెంబర్ 22)తో 44 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు. వెరసి చిరంజీవిగా తనకు 44 ఏళ్లు అని ఆయన పేర్కొన్నారు. 

1978 సెప్టెంబర్ 22న 'ప్రాణం ఖరీదు' విడుదలైందని పేర్కొన్న చిరంజీవి.. ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందని గుర్తు చేసుకున్నారు. 'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈ రోజు' అని ఆయన పేర్కొన్నారు. ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రాణం పోసి... అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారంటూ ఆయన తెలిపారు. తనను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు.