Nasa: చుట్టూ వలయాలతో నెప్ట్యూన్​ గ్రహం అందాలు.. నాసా జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ తీసిన అద్భుత చిత్రాలు!

  • ఇప్పటివరకు శని చుట్టే వలయాలు ఉన్నట్టు మనకు తెలుసు
  • ఇటీవలే నెప్ట్యూన్ చుట్టూ వలయాలు ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు
  • వాటిని అద్భుతంగా చిత్రీకరించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
  • రింగులు, ఉప గ్రహాలతో కూడిన చిత్రాలను విడుదల చేసిన నాసా
Nasa james webb space telescope first image of neptune

సౌర కుటుంబంలో అందమైన గ్రహంగా శని గ్రహానికి పేరుంది. దాని చుట్టూ ఉన్న వలయాలే ఇందుకు కారణం. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారు టెలిస్కోప్ లో మొదట చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చేది కూడా శని గ్రహం, దాని చుట్టూ ఉన్న వలయాలనే. అయితే కేవలం శనికే కాకుండా నెప్ట్యూన్ గ్రహం చుట్టూ కూడా కొంత స్థాయిలో వలయాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కిందట గుర్తించారు. కానీ నెప్ట్యూన్ ఎక్కువ దూరంలో ఉండటం, వలయాలు సన్నగా, తక్కువగా ఉండటంతో వాటిని చిత్రించలేకపోయారు.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో.. 
నాసా ఇటీవల ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మాత్రం నెప్ట్యూన్ గ్రహాన్ని, దాని చుట్టూ ఉన్న వలయాలను అత్యంత అద్భుతంగా చిత్రీకరించింది. అంతేకాదు.. నెప్ట్యూన్ చుట్టూ తిరిగే 14 ఉపగ్రహాల్లో ఏడు ఉపగ్రహాలు కూడా ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. అందులో అతిపెద్ద ఉపగ్రహం అయిన ట్రిటాన్ ఒక నక్షత్రంలా మెరుస్తూ కనిపిస్తోంది కూడా.

30 ఏళ్ల తర్వాత మళ్లీ చూడగలిగాం
‘1989లో వోయేజర్–2 వ్యోమనౌక నెప్ట్యూన్ కు సమీపంగా ప్రయాణించినప్పుడు దాని చుట్టూ వలయాలు ఉన్నట్టుగా కొన్ని చిత్రాలను తీసింది. అయితే అవి అస్పష్టంగా, కనీ కనిపించనట్టుగా ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నెప్ట్యూన్ చుట్టూ ఉన్న వలయాలను చూడగలిగాం. అదీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత స్పష్టంగా వలయాలను చూపడం అద్భుతం..” అని నాసాలో నెప్ట్యూన్ గ్రహ పరిశోధకుడు హేదీ హమ్మెల్ తెలిపారు. 

  • సూర్యుడికి భూమి ఉన్న దూరం కన్నా సుమారు 30 రెట్లు ఎక్కువ దూరంలో నెప్ట్యూన్ గ్రహం ఉంది. అంత దూరంగా ఉండటం వల్ల నెప్ట్యూన్ పై పడే సూర్య కాంతి చాలా తక్కువ.
  • నెప్ట్యూన్ లో అధిక స్థాయిలో ఉండే మీథేన్ గ్యాస్ వల్ల ఆ గ్రహం నీలి రంగులో మెరుస్తూ కనిపిస్తుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News