Raja Krishnamoorthi: పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న నన్ను ఐఎస్ఐ శత్రువులా చూస్తోంది: రాజాకృష్ణమూర్తి

  • వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న రాజాకృష్ణమూర్తి
  • ఆయనకు మద్దతుగా నిధులు సమీకరిస్తున్న యూఎస్ఐఎస్‌సీ
  • జాతి, మతం, రంగు పేరుతో తాను ఎన్నడూ వివక్ష చూపలేదన్న రాజా కృష్ణమూర్తి
Pak Spy Agency Considers Me Its Enemy Says Indian American Congressman

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకున పెడుతున్న తనను ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ శత్రువులా చూస్తోందని డెమొక్రటిక్ పార్టీ నేత, ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజాకృష్ణమూర్తి అన్నారు. ఇండో-అమెరికన్, యూఎస్ఐఎస్‌సీ అధ్యక్షుడు రమేశ్ విశ్వనాథ్ (ఆర్వీ) కపూర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వచ్చే నవంబరులో జరగనున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న రాజాకృష్ణమూర్తికి మద్దతుగా యూఎస్ఐఎస్‌సీ ఈ నిధుల సమీకరణ చేపట్టింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న తనను ఐఎస్ఐ ఓ శత్రువులా చూస్తోందని అన్నారు. అన్ని మతాల వారిని తాను గౌరవిస్తానని, జాతి, మతం, రంగు పేరుతో ఎన్నడూ వివక్ష చూపలేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కనుక మరోమారు విజయం సాధిస్తే అమెరికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఇండో-అమెరికన్ కమ్యూనిటీకి ఆయన హామీ ఇచ్చారు.

కాగా, రాజాకృష్ణమూర్తికి మద్దతుగా నిధులు సమీకరిస్తున్న యూఎస్ఐఎస్‌సీ బోస్టన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా 40 వేల డాలర్లను సమీకరించింది. ఈ కార్యక్రమంలో విక్రం రాజ్యదక్ష, దినేశ్ పటేల్, అభిషేక్ సింగ్, అమర్ సాహ్నీ, దీపకి సాహ్నే, డాక్టర్ రాజ్‌రైనా వంటి వారు పాల్గొన్నారు. రాజాకృష్ణమూర్తికి మద్దతుగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని యూఎస్ఐఎస్‌సీ పేర్కొంది. కాగా, ఇటీవల తైవాన్‌లో పర్యటించిన అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ బృందంలో ఉన్న రాజాకృష్ణమూర్తిపై చైనా, రష్యా దేశాలు నిషేధం విధించాయి.

More Telugu News