గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక్కడికే ఇవాళ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కుంది: అంబటి రాంబాబు

  • నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు
  • సభలో వాడీవేడి వాతావరణం
  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు
  • బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ సభ్యులు
Ambati Rambabu speech in assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన నేడు సభలో వాడీవేడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం బిల్లు తీసుకురావడంపట్ల టీడీపీ నేతలు పోడియంను ముట్టడించారు. కాగితాలు చించి ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దాంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. 

అంతకుముందు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, చంద్రబాబు శిక్షణ వల్లే టీడీపీ సభ్యులు ఇలా పోడియంపైకి దూసుకెళుతున్నారని విమర్శించారు. దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. 

నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక్కరే ఎన్టీఆర్ పక్షాన నిలిచారని, మిగతా వారంతా చంద్రబాబు పక్షాన చేరి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అందుకే ఇవాళ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు ఒక్క గోరంట్ల బుచ్చయ్య చౌదరికే ఉంటుందని స్పష్టం చేశారు. 

జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసినంత మాత్రాన చేసిన పాపం తొలగిపోదని విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెబితే కదా తెలిసేది? అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా అచ్చెన్న అభ్యంతరం వ్యక్తం చేయడంతో, 'ఆ లావుగా ఉన్నాయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు అధ్యక్షా' అంటూ సెటైర్ వేశారు.

More Telugu News