విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత... దేవినేని ఉమ అరెస్ట్

21-09-2022 Wed 15:13
  • ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు
  • ధర్నాకు దిగిన దేవినేని ఉమ
  • గొల్లపూడిలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం
Police arrests Devineni Uma in Vijayawada
ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విజయవాడలో ధర్నాకు దిగారు. గొల్లపూడిలోని ఎన్టీఆర్ సర్కిల్లో కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్యుద్ధం నెలకొంది. ఓ దశలో తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు దేవినేని ఉమను భవానీపురం పీఎస్ కు తరలించారు. ఇతర కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం వైపు తరలించారు. 

అంతకుముందు, దేవినేని ఉమ మాట్లాడుతూ, హెల్త్ యూనివర్సిటీ ఆలోచన చేసిందే ఎన్టీఆర్ అని, అలాంటిది ఆయన పేరు తొలగించడం దారుణమని అభిప్రాయపడ్డారు. పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోకపోతే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.