Injection: ఖమ్మం జిల్లాలో ఇంజెక్షన్ గుచ్చి చంపడం వెనుక అసలు కారణం ఇదే!

  • వివాహేతర సంబంధమే అసలు కారణం
  • భార్య ఇమాంబీనే సూత్రధారి
  • మిస్టరీ ఛేదించిన ఖమ్మం జిల్లా పోలీసులు
  • మొత్తం నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Injection murder mystery in Khammam district revealed

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జమాల్ సాహెబ్ అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా లిఫ్ట్ అడిగిన దుండగులు ఇంజెక్షన్ గుచ్చి చంపడం సంచలనం సృష్టించింది. పిచ్చికుక్కలను చంపే రసాయనాన్ని ఇంజెక్షన్ లో నింపి జమాల్ సాహెబ్ కు గుచ్చడంతో కొన్ని నిమిషాల్లోనే ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ నెల 19న ఈ ఘటన జరిగింది. ఇది సైకో పని అయ్యుంటుందని అందరూ హడలిపోయారు. అయితే, ఖమ్మం జిల్లాలో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని ఈ మిస్టరీని ఛేదించారు. 

ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్య అని, భార్యే సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీ మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే భర్త అడ్డుగా ఉన్నాడని, అతడిని అంతమొందిస్తే తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించేవారే ఉండరని ఇమాంబీ ఆలోచించింది. 

తన భర్తను చంపేయాలని నిర్ణయించుకుని మోహనరావు, వెంకట్, వెంకటేశ్ ల సహాయం తీసుకుంది. పక్కా ప్రణాళికతో వ్యవహరించిన నిందితులు మానవతా దృక్పథంతో లిఫ్ట్ ఇచ్చిన జమాల్ సాహెబ్ ను నిర్దాక్షిణ్యంగా అంతమొందించారు.

ఇప్పుడు వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, రెండు నెలల నుంచే జమాల్ సాహెబ్ ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది.

More Telugu News