Team India: మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన

India squad for ACC Womens T20 Championship announced
  • వచ్చే నెల 1 నుంచి బంగ్లాదేశ్ లో మెగా టోర్నీ 
  • భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
  • అక్టోబర్7న పాక్- భారత్ మ్యాచ్
బంగ్లాదేశ్ లోని సైలెట్ వేదికగా అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును ఆలిండియా మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్  కౌర్ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. 

ఇక ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ సబ్బినేని మేఘనకు చోటు దక్కింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్‌, శ్రీలంక, యూఏఈ, థాయ్‌లాండ్‌, మలేసియా బరిలో నిలిచాయి.. తాలిబన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో అమ్మాయిల ఆటపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆఫ్ఘన్ క్రికెట్‌ టీమ్‌ ఈ టోర్నీకి దూరంగా ఉంది. 

తొలి రోజు, అక్టోబర్1న భారత్–శ్రీలంక మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 3, 4 వ తేదీల్లో భారత్.. వరుసగా మలేసియా, యూఏఈతో తలపడుతుంది. ఏడో తేదీన చిరకాల ప్రత్యర్థి పాక్‌ ను ఢీకొట్టనుంది. 8న బంగ్లాతో, 10న థాయ్‌లాండ్‌తో పోటీ పడుతుంది. 11, 13వ తేదీల్లో సెమీఫైనల్స్‌, 15న ఫైనల్‌ షెడ్యూల్‌ చేశారు.
 
భారత జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోశ్(కీపర్), స్నేహ్ రాణా, దయలన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవ్గిరే.
స్టాండ్ బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్.
Team India
womens
team
womens asia cup t20
sabbineni meghana
Andhra Pradesh

More Telugu News