YSRCP: మా పిల్లలు డాక్టర్లు కావొద్దా?: వైసీపీ ఎమ్మెల్సీ రవీందర్ ఆవేదన

  • ‘అంబేద్కర్ విదేశీ విద్య’ పథకంపై శాసన మండలిలో చర్చ
  • అక్రమాలు జరిగాయంటూ కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం
  • అప్పటి ప్రభుత్వం రూ. 10 లక్షలైనా ఇచ్చిందన్న ఎమ్మెల్సీ
  • ఇప్పుడు రూ.కోటి ఇస్తున్నా అందకుండా పోతోందని ఆవేదన
YCP MLC Pandula Ravindra Babu about ambedkar videshi vidya

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత ప్రభుత్వం ‘అంబేద్కర్ విదేశీ విద్యా నిధి’ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వైసీపీ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీందర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులకు ఆ పథకం ప్రయోజనం అందకుండా పోయిందన్నారు. నిన్న శాసన మండలిలో ఈ పథకం అమలుపై మంత్రి నాగార్జున మాట్లాడారు. 

అనంతరం జరిగిన చర్చలో ఎమ్మెల్సీ రవీందర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యా పథకంలో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ నివేదిక చెబుతోందన్న ఆయన.. అందులో పేర్కొన్న విషయాలను ప్రస్తావించారు. ఒక దేశానికి బదులు మరో దేశానికి వెళ్లారని, ఒక కోర్సుకు బదులు మరో కోర్సు చదివారని పేర్కొన్నారు తప్పితే  డబ్బులు తీసుకుని దుర్వినియోగం చేసినట్టు ఎక్కడా లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

విద్యార్థులు  ఒక దేశానికి బదులు మరో దేశానికి, ఒక కోర్సుకు బదులు మరో కోర్సు చదివితే తప్పేంటని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం రూ. 10 లక్షలు అయినా ఇచ్చిందన్న ఆయన.. ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో కోటి రూపాయలు ఇచ్చినా అది విద్యార్థులకు అందకుండా పోతోందని అన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు పేదలు అప్పులు చేస్తున్నారని, కిడ్నీలు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జలుబు చేసిందని ముక్కు తీసేస్తారా?

‘అంబేద్కర్ విదేశీ విద్య’ పథకంపై రవీందర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఈ పథకం అమలులో కఠిన నిబంధనలు తీసుకురావడం ద్వారా బడుగు వర్గాల పిల్లలకు ఈ పథకం అందకుండా పోతోందన్నారు. ప్రపంచంలోని మొదటి 100 స్థానాల్లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు వస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారని, అదే టాప్-200 స్థానాల్లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు సంపాదిస్తే రూ. 50 లక్షలు ఇస్తామన్నారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ.. వీటిలో పేదల పిల్లలకు సీట్లు లభిస్తాయా? అని ప్రశ్నించారు. 

జేఎన్‌టీయూ, ఐఐటీల్లోనే సీట్లు రావడం గగనంగా ఉంటే ప్రపంచస్థాయి వర్సిటీల్లో సీట్లు ఎలా వస్తాయని అన్నారు. ఇలాంటి నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ పిల్లలను విదేశీ విద్యకు దూరం చేసినట్టు కాదా? అని ప్రశ్నించారు. తమ పిల్లలు డాక్టర్లు కావొద్దా? అని నిలదీశారు. జలుబు చేసిందని ముక్కు తీసేస్తారా? అన్న ఆయన నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి నాగార్జున.. రవీందర్ సానుకూల దృక్పథంతో ఆలోచించాలని సూచిస్తూ చర్చను నేటికి వాయిదా వేశారు.

More Telugu News