రూ. 30 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్ బండి’ పెళ్లికొడుకు

21-09-2022 Wed 07:25
  • బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అశోక్
  • ఇంటి నిర్మాణ అనుమతి కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ. 30 వేలు డిమాండ్
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
  • కార్యాలయం, ఇంటిలో సోదాలు
Bullettu Bandi Song Fame Akuala Ashok Caught by ACB
‘నే బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన సాయిశ్రియ-అశోక్ జంట మీకు గుర్తుందా? అప్పగింతల సమయంలో ఆ పాటకు భర్త ముందు డ్యాన్స్ చేసిన నవ వధువు వీడియో సోషల్ మీడియాకెక్కి అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ‘బుల్లెట్ బండి’ ఒరిజినల్ సాంగ్‌కు మరింత క్రేజ్ వచ్చి లక్షలాది వ్యూస్ లభించాయి. ఏడాది క్రితం ఈ ఘటన జరిగింది. 

ఇక ఆ పాటతో రాత్రికి రాత్రే పాప్యులర్ అయిపోయిన పెళ్లికొడుకు ఆకుల అశోక్ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సాయిశ్రియ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

అశోక్ తాజాగా రూ.30 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంటి నిర్మాణం విషయంలో తన వద్దకు వచ్చిన దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి అశోక్ లంచం డిమాండ్ చేశాడు. అతడు నిన్న లంచం సమర్పించుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత కార్యాలయంతోపాటు అశోక్ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.