Chittoor: చిత్తూరు పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. తండ్రీకొడుకులు సహా ముగ్గురి సజీవ దహనం

  • చిత్తూరు రంగాచారి వీధిలో తెల్లవారుజామున 2 గంటలకు ఘటన
  • స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వచ్చి మంటలకు బలైన యువకుడు
  • షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానం
Huge Fire Accident in Chittoors Ragnachari street 3 dead

చిత్తూరులోని ఓ పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో తండ్రీ కొడుకులు సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానిక రంగాచారి వీధిలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భాస్కర్ (65)కు ఉన్న రెండంతస్తుల భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. రెండో అంతస్తులో వారు ఉంటున్నారు. 

నిన్న రాత్రి వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కిందనున్న పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు రెండో అంతస్తుకు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీబాబు (35), కుమారుడి స్నేహితుడు బాలాజీ (25) ప్రాణాలు కోల్పోయారు. 

మంటలు చూసి అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే భవనాన్ని మంటలు చుట్టుముట్టేశాయి. మంటలను అదుపు చేసిన తర్వాత తలుపులు బద్దలుగొట్టిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి వున్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కాగా, ఢిల్లీబాబు మంగళవారమే పుట్టిన రోజు జరుపుకున్నాడు. వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన స్నేహితుడు బాలాజీ రాత్రి అక్కడే ఉన్నాడు. ప్రమాదంలో అతడు కూడా మరణించాడు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News