వారానికి కనీసం 150 నిమిషాలు చాలు... ఆయుష్షు పెరుగుతుందంటున్న పరిశోధకులు

20-09-2022 Tue 18:31
  • శరీర ఆరోగ్యానికి వ్యాయామం
  • 30 ఏళ్ల పాటు కొనసాగిన అధ్యయనం
  • 1.16 లక్షల మందిపై పరిశీలన
  • వ్యాయామంతో మృత్యుభయం ఉండదంటున్న పరిశోధకులు
At least 150 minutes physical activity can reduce death risk
శరీర ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా చేసే కసరత్తులతో శరీరం శక్తిని పుంజుకుంటుంది. మానవుడి జీవితకాలంలో వ్యాయామం ప్రాధాన్యత ఎంతో ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారానికి కనీసం 150 నిమిషాల సేపు వ్యాయామం చేసినా చాలని, ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదేమీ స్వల్పకాలిక అధ్యయనం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు 1.16 లక్షల మందిపై నిశిత పరిశీలన చేశారు. ఆరోగ్య రంగానికి చెందిన వారినే ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ఈ అధ్యయనం 1988 నుంచి 2018 వరకు సాగింది. వారి భౌతిక కార్యాచరణపై కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. 

నిత్యం వ్యాయామం చేసేవారిలో, అన్ని రకాల అనారోగ్య సంబంధిత మరణాల నుంచి ముప్పు చాలావరకు తగ్గినట్టు గుర్తించారు. వారానికి 150 నుంచి 599 నిమిషాల పాటు వ్యాయామం చేసే వారిలో ప్రాణగండం రేటు బాగా తగ్గిపోయిందట. 

150 నుంచి 299 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిలో డెత్ రేటు 2 శాతం నుంచి 4 శాతం తగ్గిపోగా... 300 నుంచి 599 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిలో 3 నుంచి 13 శాతం తగ్గిపోయిందని అధ్యయనంలో పేర్కొన్నారు.