నేడు ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భారత్ లక్ష్యమేంటి? మ్యాచ్ కు వాన ముప్పుందా?

20-09-2022 Tue 12:39
  • మొహాలీలో కొద్ది పాటి వర్షం కురిసే అవకాశం
  • రా. 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం
  • ఈ సిరీస్ తో ప్రపంచ కప్ కాంబినేషన్ పై అంచనాకు రావాలని చూస్తున్న రోహిత్ సేన 
Will rain play spoilsport in India vs Australia 1st T20I
ఆసియా కప్‌లో నిరాశ పరిచిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సవాల్ కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం రాత్రి మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ నకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ద్వారా ప్రపంచ కప్ లో ఎలాంటి కాంబినేషన్ తో బరిలోకి దిగాలన్న అంచనాకు రావాలని కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆసియాకప్‌లో బయటపెట్టిన బలహీనతలను సరిదిద్దుకునేందుకు ఈ సిరీస్‌ ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. 

ఆసియా కప్ లో భారత్ బాగానే బ్యాటింగ్‌ చేసినప్పటికీ తుది జట్టులో అతి మార్పులు దెబ్బకొట్టాయి. బౌలింగ్‌ కూడా బలహీనంగా కనిపించింది. కానీ, బుమ్రా, హర్షల్‌  తిరిగి రావడంతో బౌలింగ్‌ విభాగం బలోపేతం అయింది. ఆసియా కప్ లో నిరాశ పరిచిన ఓపెనర్ కేఎల్ రాహుల్ తిరిగి గాడిలో పడితే జట్టుకు మంచిది. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ లో ఎవరిని వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ గా తీసుకోవాలనే దానిపై కూడా ఈ సిరీస్ తో భారత యాజమాన్యం ఓ అంచనాకు రావాలని చూస్తోంది. 

భారత్ మాదిరిగా ఆస్ట్రేలియా కూడా ప్రపంచ కప్ సన్నాహకాల్లో ఉంది. ఈ సిరీస్ లో డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి ఇవ్వగా.. మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ మార్ష్‌ గాయాల కారణంగా స్వదేశంలోనే ఉండిపోయారు. వీళ్లు లేకపోయినా ఆసీస్‌ నుంచి భారత్ కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. గతంలో సింగపూర్‌ కు ఆడి ఈ సిరీస్ తో ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయబోతున్న పవర్ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ పై అందరి దృష్టి ఉంది. ఇక, ఈ టీ20 పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మొహాలీలో వర్షం కురిసే అవకాశం 20 శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని వల్ల కొంచెం ఇబ్బంది కలిగినా..  మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేదని  భావిస్తున్నారు.