Magunta Sreenivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ అంశంతో మాకు సంబంధం లేదు.. వ్యాపారాలకు ఎంపీ పదవిని వాడుకోలేదు: మాగుంట శ్రీనివాసులు రెడ్డి

  • లిక్కర్ వ్యవహారంలో రెడ్డి అనే పేరు వస్తే... తన గురించే అనుకుంటున్నారన్న మాగుంట 
  • మాగుంట ఆగ్రో ఫామ్ అనేది తమ బంధువులదని వివరణ 
  • సాయం చేయమని ఏ సీఎంని అడగలేదని వెల్లడి  
Magunta Sreenivasulu Reddy response on Delhi liquor

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి మాగుంటకు చెందిన నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో అనేక చోట్ల దర్వాప్తు సంస్థలు సోదాలు, విచారణలు జరుపుతున్నాయని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంతో తమకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం లేదని అన్నారు. దేశంలో లిక్కర్ కు సంబంధించి రెడ్డి అనే పేరు వస్తే... మాగుంట శ్రీనివాసులు రెడ్డే అంటారని.. అది మంచో, చెడో తనకు తెలియదని చెప్పారు. గత 70 ఏళ్లుగా తమ కుటుంబం లిక్కర్ బిజినెస్ లో ఉందని... అందుకే అందరూ తన గురించి అనుకుంటారని అన్నారు. 

తనకు, తన కొడుకుకి ఢిల్లీ లిక్కర్ తో సంబంధం లేదని తెలిపారు. మాగుంట ఆగ్రో ఫామ్ పేరు రావడంతో అందరూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటున్నారని... అయితే అది తమ బంధువులదని చెప్పారు. తమ వ్యాపారానికి సాయం చేయమని తాను ఏ సీఎంని కూడా అడగలేదని అన్నారు. తన వ్యాపారాలకు తన ఎంపీ హోదాను ఎక్కడా వాడుకోలేదని చెప్పారు. ఏపీలో లిక్కర్ మాఫియా గురించి స్పందించాలనే ప్రశ్నకు బదులుగా... దాని గురించి వద్దని... తన గురించి మాత్రమే మాట్లాడతానని అన్నారు. 

ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని మాగుంట చెప్పారు. తమ బంధువులు చేసే వ్యాపారాలు తమకు ఇబ్బంది కలిగించాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణల వల్ల తన రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదని... వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు.

More Telugu News