మనం మంచి ట్రెండ్ లో ఉన్నాం: 'అల్లూరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్

18-09-2022 Sun 22:25
  • శ్రీవిష్ణు, కయాదు లోహార్ జంటగా 'అల్లూరి'
  • హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్
Allu Arjun attends Alluri pre release event
శ్రీవిష్ణు హీరోగా నటించిన 'అల్లూరి' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, హీరో శ్రీవిష్ణు అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన కోసం విచ్చేసిన తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరంతా నా ఆర్మీ అంటూ ఉత్సాహపరిచారు. 

హీరోయిన్ కయాదు లోహార్ పేరును పలికేందుకు బన్నీ ఇబ్బందిపడ్డారు. ఆమె పేరేంటని ఇప్పటిదాకా మూడుసార్లు అడిగానంటూనే, స్టేజిపై నాలుగోసారి కూడా ఏం పేరని అడిగారు. 'కయాదు' అంటూ ఎట్టకేలకు హీరోయిన్ పేరును పలికారు. 

హీరో శ్రీవిష్ణు గురించి చెబుతూ, అతడి మొదటి చిత్రం 'ప్రేమ ఇష్క కాదల్' నుంచి శ్రీవిష్ణును ఫాలో అవుతున్నానని తెలిపారు. శ్రీవిష్ణు సినిమాలు ఎంతో కొత్తగా ఉంటాయని, అతడెంతో కష్టపడి పనిచేస్తాడని కితాబిచ్చారు. తాను ఎంతో బిజీగా ఉన్న సమయంలోనూ విష్ణు వచ్చి ఈ కార్యక్రమానికి రావాలని అడిగాడని, దాంతో కాదనలేకపోయానని వెల్లడించారు. 

కరోనా తర్వాత ఆసక్తికరమైన ట్రెండ్ నెలకొందని అల్లు అర్జున్ తెలిపారు. చిన్న సినిమానా, పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆడుతుందని అన్నారు. మంచి సినిమా అయితే చాలు... ప్రజలు ఆదరిస్తున్నారు అని వివరించారు. మనం చాలా మంచి ట్రెండ్ లో ఉన్నామని, కంటెంట్ బాగుంటే ఎవరూ భయపడక్కర్లేదని అన్నారు. ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారని తెలిపారు. 'అల్లూరి' చిత్రం సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు వస్తోందని, ఈ సినిమాను ఆదరించాలని పిలుపునిచ్చారు.

అల్లూరి చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృథ్వీ, జయవాణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.