అదృష్టం అలా వరించింది... కేరళ ఆటోడ్రైవర్ కు రూ.25 కోట్ల లాటరీ

18-09-2022 Sun 21:38
  • తిరువనంతపురానికి చెందిన్ అనూప్ కు జాక్ పాట్
  • ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న అనూప్
  • చెఫ్ గా పనిచేసేందుకు మలేసియా వెళ్లాలని నిర్ణయం
  • తొలుత ఓ లాటరీ కొనుగోలు చేసిన అనూప్
  • అది నచ్చక మరో టికెట్ ను ఎంచుకున్న వైనం
  • ఇప్పుడా టికెట్ కే జాక్ పాట్
Kerala auto driver wins 25 crores lottery
కేరళలో ఓ ఆటోడ్రైవర్ ను అనూహ్యరీతిలో అదృష్టం పలకరించింది. తొలుత ఓ లాటరీ టికెట్ ఎంచుకున్న అతగాడు, అది నచ్చక మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడా రెండో టికెట్ కు ఏకంగా రూ.25 కోట్ల జాక్ పాట్ తగిలింది. అదృష్టం కాక మరేమిటి! 

తిరువనంతపురం శ్రీవరాహం ప్రాంతంలో నివసించే అనూప్ ఓ ఆటోడ్రైవర్. అతడికి వంటల్లోనూ ప్రావీణ్యం ఉంది. అందుకే చెఫ్ గా పనిచేసేందుకు మలేసియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం బ్యాంకులో రూ.3 లక్షల లోన్ కోసం అప్లై చేసుకున్నాడు. 

ఇక, అనూప్ కు లాటరీల పిచ్చి ఉంది. ఎప్పటికైనా దశ తిరగకపోతుందా అని గత 22 ఏళ్లుగా లాటరీలు కొంటున్నాడు. మలేసియా వెళుతున్నాం కదా, చివరిసారిగా ఓ టికెట్ కొందాం అని ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఎందుకనో ఆ టికెట్ నచ్చక, మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడా టికెట్టే అనూప్ జీవితాన్ని మార్చివేసింది. అతడిని కోటీశ్వరుడ్ని చేసింది. 

ట్యాక్స్ లు అన్నీ పోను ఆ ఆటోడ్రైవర్ కు రూ.15 కోట్ల వరకు వస్తాయట. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటానని, అప్పులన్నీ తీర్చేస్తానని అనూప్ చెబుతున్నాడు. బంధువులకు సాయం చేయడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడతానని వెల్లడించాడు. అంతేకాదు, ఇక మలేసియా వెళ్లనని, కేరళలోనే ఉంటానని తెలిపాడు.