జపాన్ పై విరుచుకుపడిన రాకాసి టైఫూన్ 'నన్మదోల్'

18-09-2022 Sun 21:13
  • క్యూషు దీవిని తాకిన నన్మదోల్
  • గంటకు 180 కిమీ వేగంతో పెనుగాలులు
  • జపాన్ లో కుండపోత వానలు
  • ఉప్పెన, వరదలు వచ్చే అవకాశం
  • బుల్లెట్ రైళ్లు, విమానాలు, ఫెర్రీలు రద్దు
Super Typhoon Nanmadol hits Japan land
సూపర్ టైఫూన్ నన్మదోల్ జపాన్ భూభాగాన్ని ప్రచండవేగంతో తాకింది. గంటకు 180 కిమీ వేగంతో పెనుగాలులు, కుండపోత వానలతో జపాన్ పై విరుచుకుపడింది. ఇప్పటిదాకా జపాన్ ను తాకిన అతిపెద్ద టైఫూన్లలో నన్మదోల్ ఒకటి. 

దీని ప్రభావంతో 500 మిమీ వర్షపాతం నమోదువుతుందని జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా, భారీవరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు, బుల్లెట్ ట్రైనులు, వివిధ దీవుల మధ్య ప్రయాణికులను చేరవేసే ఫెర్రీలు, వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. 40 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. 

నన్మదోల్ టైఫూన్ ఈ ఉదయం క్యూషు దీవిలోని కగోషియా నగరం వద్ద తీరాన్ని చేరింది. దాంతో ఈ దీవిలో స్పెషల్ అలెర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతం వెంబడి ఉప్పెన వచ్చే అవకాశముందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.