ఎవరేం అనుకున్నా సరే.. టీ20ల్లో అతనే నం.1 ఆల్​రౌండర్​ అంటున్న రవిశాస్త్రి

18-09-2022 Sun 13:06
  • టీ20 ఫార్మాట్ లో హార్దిక్ పాండ్యానే నం.1 అని పునరుద్ఘాటన
  • ఇతరుల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదన్న శాస్త్రి
  • ఆసియా కప్ లో నిరాశ పరిచిన హార్దిక్
Hardik Pandya is no1 all rounder reiterats Ravi Shastri
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో హార్దిక్ పాండ్యాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అతను జట్టులో టాప్ ఆల్ రౌండర్. జట్టు అవసరాలకు తగ్గట్టు ఎంతో పరిణితితో బ్యాటింగ్ చేస్తున్న అతను ఈ మధ్య బౌలింగ్ లోనూ జోరు పెంచాడు. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తనదైనశైలిలో టీ20 ఫార్మాట్ లో పాండ్యా ప్రపంచంలోనే నంబర్ వన్ ఆల్ రౌండర్ అని మరోసారి పునరుద్ఘాటించాడు.  

‘ఈ ఫార్మాట్‌లో అతను నంబర్ 1 ఆల్ రౌండర్ అని నేను ఇప్పటికే ట్వీట్ చేశా. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కూడా పోస్ట్ చేశాను. మీకు ఇంకా ఏమి కావాలి? నేను రెండు వారాల క్రితమే నా అభిప్రాయం చెప్పాను. దీని గురించి కూడికలు, తీసివేతలు ఎందుకు? ఎవరేం అనుకున్నా సరే నా అభిప్రాయం స్పష్టంగా ఉంది. పాండ్యానే నం.1 ఆల్ రౌండర్. ఈ విషయం నేను కొన్ని వారాల క్రితం ట్వీట్ చేశాను’ అని శాస్త్రి పేర్కొన్నాడు. పాండ్యా బౌలింగ్ విషయంలో ఈ మధ్య కొందరు మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో శాస్త్రి ఈ కామెంట్లు చేశారు.

ఇటీవల, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ హార్దిక్‌ను నాలుగో మీడియం పేసర్‌గా జట్టులోకి తీసుకోవాలని, మూడో పేసర్ గా అతను సరిపోడని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో హార్దిక్ తన నాలుగు ఓవర్లలో కేవలం ఒక వికెట్‌తో 44 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యాను ప్రధాన పేసర్గా ఉపయోగించకూడదని మంజ్రేకర్ చెప్పాడు. ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లో పాక్ పై భారత్ ను ఒంటి చేత్తో గెలిపించిన పాండ్యా తర్వాత నాలుగు మ్యాచుల్లో నిరాశ పరిచాడు.