Tamil Nadu: ఒకటి కాదు యువరానర్.. ఐదు శిక్షలు విధించండి: కోర్టులో కేకలేసిన హత్యకేసు దోషి

Murder Convict ask judge to impose five life imprisonments
  • తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా కోర్టులో ఘటన
  • భార్య హత్య కేసులో దోషిగా తేలిన భర్త
  • రూ. 2 లక్షల జరిమానా.. యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు
  • తాను చేసిన తప్పుకు ఆ శిక్ష సరిపోదంటూ కోర్టులో దోషి కేకలు
కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తుండగా.. ఒకటి కాదు తనకు ఐదు శిక్షలు విధించాలంటూ ఓ హత్యకేసు దోషి కోర్టులోనే కేకలు వేశాడు. తాను తీరని నేరం చేశానని, తనకు ఐదు శిక్షలు విధించి పుణ్యం కట్టుకోవాలని న్యాయమూర్తిని ప్రాధేయపడ్డాడు. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా కోర్టులో జరిగిందీ ఘటన. జిల్లాలోని అరవంగాల్‌పట్టి గ్రామానికి చెందిన మురుగేశన్ (42)  తన భార్య శకుంతలను రెండేళ్ల క్రితం గొంతు నులిమి హత్య చేశాడు.

ఈ కేసులో శుక్రవారం తుది తీర్పు వెలువడింది. నిందితుడైన మురుగేశన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. న్యాయమూర్తి తీర్పు చెప్పడం పూర్తికాకముందే కల్పించుకున్న మురుగేశన్.. తనకు కనీసం ఐదు యావజ్జీవాలైనా విధించాలని, తాను చేసిన తప్పుకు అదే సరైన శిక్ష అంటూ కోర్టులో కేకలు వేశాడు. అది విన్న న్యాయమూర్తి.. అలా కుదరదని కేసు తీవ్రతను బట్టే శిక్ష ఉంటుందని బదులిచ్చారు.
Tamil Nadu
Pudukkottai
Court
Murder Convict

More Telugu News