RTA: ఇక వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆన్ లైన్ లోనే!

  • పౌరులకు సులభతర సేవలు
  • నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర రోడ్డు రవాణా సంస్థ
  • ఆన్ లైన్ లో 58 రకాల సేవలు
  • ఆధార్ కార్డుతో ఇంటివద్దనే సేవలు 
Citizens may get RTA services through online

రవాణా వ్యవస్థకు సంబంధించి పౌరులకు సులభతర సేవలు అందించే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలతో నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పర్మిట్, యాజమాన్య హక్కుల బదిలీ తదితర 58 రకాల సేవలన్నీ ఇకపై ఆన్ లైన్ లోనే పొందవచ్చు. 

గతంలో ఈ సేవలకు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్రం నూతన విధానంతో వాహనదారులు ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పనుంది. ఆధార్ కార్డు ఉంటే చాలు... లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్, రీప్లేస్ మెంట్, రెన్యువల్, డ్రైవింగ్ లైసెన్స్ సవరణలు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, వాహన రిజిస్ట్రేషన్ అప్లికేషన్, వాహన నెంబరు కొనసాగింపు, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ వంటి సేవలన్నింటినీ ఇంటి వద్ద కూర్చునే పొందవచ్చు. 

ఈ విధానంతో పౌరుల సమయం ఆదా అవుతుందని, ఆర్టీవో ఆఫీసులకు ప్రజల తాకిడి తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా ఆర్టీవో ఆఫీసుల పని సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. ఆధార్ నెంబరు లేనివాళ్లు ఇతర గుర్తింపు పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించి పై సేవలను పొందవచ్చని తెలిపింది.

More Telugu News