Ceramico: షాజహాన్, ముంతాజ్ ల ప్రేమగాథ స్ఫూర్తిగా... భారత్ వచ్చి పెళ్లి చేసుకున్న మెక్సికో జంట

Mexican couple ties the knot in Agra
  • భారత సంస్కృతిపై అభిమానం పెంచుకున్న మెక్సికన్ జంట
  • తమ ప్రేమను పండించుకునేందుకు ఆగ్రా వచ్చిన వైనం
  • స్థానిక హోటల్ యజమాని సాయంతో పెళ్లి
భారత సంస్కృతి, సంప్రదాయాలు విదేశీయులను ఆకర్షించడం కొత్తేమీకాదు. హిందూ మతాన్ని అవలంబిస్తూ భారత్ కు ఎంతో మంది ఇతర దేశస్తులు ఆధ్యాత్మిక యాత్రల కోసం వస్తుంటారు. అంతేకాదు, చాలామంది విదేశీయులు పెళ్లి చేసుకునేందుకు కూడా భారత్ వస్తుంటారు. మెక్సికోకు చెందిన ఈ జంట కూడా  పెళ్లి చేసుకునేందుకు భారత్ వచ్చింది. 

వధువు పేరు క్లాడియా, వరుడి పేరు సెరామికో. ఈ మెక్సికన్లు మొఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ బేగంల ప్రేమకథతో స్ఫూర్తిపొందారు. అంతేకాదు, షాజహాన్, ముంతాజ్ ల అజరామర ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ వారిని విశేషంగా ఆకర్షించింది. తమ ప్రేమ కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలని వారు ఆకాంక్షించారు. 

అందుకే క్లాడియా, సెరామికో తమ ప్రేమను పండించుకునేందుకు ఆగ్రా వచ్చారు.  ఇక్కడి శివాలయంలో పూర్తి హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గౌరవ్ గుప్తా అనే హోటల్ యజమాని వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఓ రెస్టారెంటులో భారీ విందు కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లికి క్లాడియా, సెరామికోల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక టూర్ ఆపరేటర్లు, గైడ్లు, డ్రైవర్లు, స్థానిక హోటళ్ల సిబ్బంది హాజరయ్యారు. 

కాగా, పెళ్లితో ఒక్కటైన ఈ మెక్సికో జంట మాట్లాడుతూ, షాజహాన్, ముంతాజ్ ల ప్రేమకథ తమను కదిలించివేసిందని చెప్పారు. భారత సంస్కృతి అంటే తమకు ఎంతో ఇష్టమని, పెళ్లంటూ చేసుకుంటే భారత్ లోనే చేసుకోవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నామని తెలిపారు. కాగా, ఈ పెళ్లి తంతుకు రూ.35 వేలు ఖర్చయ్యాయని హోటల్ యజమాని గౌరవ్ గుప్తా వెల్లడించారు.
Ceramico
Claudia
Mexico
Agra
Marriage
India

More Telugu News