Blood Sugar: ఈ మూడు రకాల దుర్వాసనలు హై బ్లడ్ షుగర్ లక్షణాలు కావొచ్చు!

  • జీవితకాలం వెంటాడే షుగర్
  • నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాపాయం
  • రక్తంలో కీటోన్ల స్థాయి పెరిగితే చెడు శ్వాసగా మారే వైనం
  • వైద్యుల సలహా తీసుకోవాలంటున్న నిపుణులు
Three breathing signs to know high blood sugar levels

మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం పాటు మందులు వాడాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర పరిణామాలు తప్పవు. ఈ డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలు, వ్యవస్థలు దారుణంగా దెబ్బతింటాయి. ఎప్పటికప్పుడు రక్త పరీక్ష ద్వారా బ్లడ్ షుగర్ స్థాయులను తెలుసుకుంటుండవచ్చు. అయితే, మూడు రకాల శరీర దుర్వాసనల ఆధారంగానూ అధిక మధుమేహాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

కీటోయాసిడోసిస్ అనేది డయాబెటిస్ కలిగించే ప్రాణాంతక దుష్ఫలితాల్లో ప్రధానమైనది. రక్తంలోని చక్కెరలను శక్తిగా మార్చుకునేందుకు శరీరానికి ఇన్సులిన్ తోడ్పడుతుంది. ఇన్సులిన్ తగు మోతాదులో లభ్యం కాకపోతే శరీరానికి అవసరమైన శక్తి కోసం కాలేయం కొవ్వును కరిగిస్తుంది. 

ఈ ప్రక్రియలో అనేక ఆమ్లాలు విడుదలవుతాయి. ఈ ఆమ్లాలనే కీటోన్లు అంటారు. ఇవి రక్తంలో కలవడం వల్ల రక్తం యాసిడ్ మయంగా మారుతుంది. అప్పుడు శరీరంలో మూడు రకాల దుర్వాసనలు ఉత్పన్నమవుతాయి. శరీరంలో అధికంగా ఉన్న కీటోన్లు శ్వాస ద్వారా, చెమట ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఈ సమయలోనే నోరు దుర్వాసన వేస్తుంటుంది. ఇది మూడు రకాలుగా ఉంటుందుని నిపుణులు తెలిపారు.


1. ఫలాలు తిన్నట్టుగా నోరు వాసన వస్తుంది.
2. చెడు శ్వాస మలాన్ని తలపించేలా దుర్వాసన వేస్తుంటుంది. దీర్ఘకాలపు వాంతులు, పేగుల్లో సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
3. అమ్మోనియా వంటి ఘాటైన వాయువులా వాసన వస్తుంటుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారిలో ఈ తరహా వాసనను గుర్తించవచ్చు.

రక్త, మూత్ర పరీక్షల ద్వారానే కాకుండా పై మూడు తరహా చెడు శ్వాస లక్షణాల ఆధారంగానూ అధిక బ్లడ్ షుగర్ ను గుర్తించవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ లక్షణాలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, వెంటనే వైద్యులను సంప్రదించి తగు సలహాలు తీసుకోవాలని తెలిపారు.

More Telugu News