ఎయిరేషియా విమానాలు చెప్పిన టైముకే వస్తాయట... డీజీసీఐ నివేదిక

17-09-2022 Sat 16:09
  • ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ నివేదిక వెల్లడించిన డీజీసీఐ
  • 93.3 శాతం కచ్చితత్వం సాధించిన ఎయిరేషియా
  • ఎయిరిండియాకు మూడోస్థానం
  • సీట్ల భర్తీలో స్పైస్ జెట్ కు ఫస్ట్ ప్లేస్
DGCI report of on time performance
కరోనా సంక్షోభం అనంతరం దేశీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో, దేశీయ విమాన సంస్థల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఐ) వెల్లడించింది. ఆగస్టులో దేశీయ విమాన సంస్థల విమానాల్లో 1.01 కోట్ల మంది ప్రయాణించారని డీజీసీఐ తెలిపింది. జులైలో 97.05 లక్షల మంది ప్రయాణించగా, ఆగస్టు నెలకు వారి సంఖ్య 4 శాతం పెరిగిందని వివరించింది. 

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 7.7 కోట్ల మందిని దేశీయ విమాన సంస్థలు చేరవేశాయని వెల్లడించింది. 2021లో ఇదే కాల వ్యవధిలో 4.6 కోట్ల మంది ప్రయాణించగా, ఈసారి 67.38 శాతం వృద్ధి నమోదైంది.

 ఇక, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి విమానాశ్రయాల్లో సకాలంలో చేరుకునే విమానాల వివరాలను కూడా డీజీసీఐ పంచుకుంది. ఈ జాబితాలో ఎయిరేషియా టాప్ లో నిలిచింది. చెప్పిన టైముకే వచ్చే విమానయాన సంస్థల్లో ఎయిరేషియా అగ్రస్థానంలో ఉందని డీజీసీఐ వెల్లడించింది.

ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ (సమయపాలన) వివరాలు చూస్తే... ఎయిరేషియా 93.3 శాతం, విస్తారా 91.4 శాతం, ఎయిరిండియా 87.9 శాతం, ఇండిగో 85.5 శాతం, స్పైస్ జెట్ 79.1 శాతం, గో ఫస్ట్ 74.9 శాతం, అలయన్స్ ఎయిర్ 72.1 శాతంగా ఉంది. 

సీట్ల భర్తీ శాతం చూస్తే.... స్పైస్ జెట్ కు మొదటిస్థానం లభించింది. సీట్ల భర్తీలో స్పైస్ జెట్ 84.6 శాతం నమోదు చేయగా, విస్తారా 84.4 శాతం, ఇండిగో 78.3 శాతం, గో ఫస్ట్ 81.6 శాతం, ఎయిరిండియా 73.6 శాతం, ఎయిరేషియా 74.9 శాతం, అలయెన్స్ ఎయిర్ 65.5 శాతం నమోదైంది.