సుప్రీంలోనూ వైసీపీ స‌ర్కారుకు భంగ‌పాటు త‌ప్ప‌దు: ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌

17-09-2022 Sat 15:36
  • రాజ‌ధానిపై హైకోర్టు తీర్పును సుప్రీంలో స‌వాల్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
  • చ‌ట్ట‌స‌భ‌ల‌ను త‌క్కువ చేసేలా హైకోర్టు తీర్పు ఇవ్వ‌లేద‌న్న క‌న‌క‌మేడ‌ల‌
  • సుప్రీంలోనూ ఏపీ స‌ర్కారుకు చెంపపెట్టులాంటి తీర్పు వ‌స్తుంద‌న్న ప‌య్యావుల‌
tdp leaders kanakamedala and payyavula fires over ap petition in supreme court
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తేనంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ స‌ర్కారు సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన వ్య‌వ‌హారంపై టీడీపీ మండిప‌డింది. ఈ మేర‌కు శ‌నివారం సుప్రీంకోర్టులో వైసీపీ స‌ర్కారు పిటిష‌న్ వేసింద‌న్న విష‌యం తెలిసినంత‌నే స్పందించిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ సభ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్‌ ఏపీ ప్ర‌భుత్వం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైకోర్టులో మాదిరే సుప్రీంకోర్టులోనూ వైసీపీ సర్కారుకు మ‌రోమారు భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని ఆయ‌న చెప్పారు.

అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌కు శనివారం మ‌ద్ద‌తు తెలిపిన సంద‌ర్భంగా ర‌వీంద్ర‌కుమార్ మాట్లాడారు. చ‌ట్ట‌స‌భ‌ల‌ను త‌క్కువ చేసేలా హైకోర్టు తీర్పు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న అన్నారు. కేవ‌లం దురుద్దేశంతోనే ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును వ‌క్రీక‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్ట‌కుండా 6 నెల‌లు ఆగి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఇదిలా ఉంటే... హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ స‌ర్కారు స‌వాల్ చేసిన వ్య‌వ‌హారంపై పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ మండిప‌డ్డారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను సుప్రీంకోర్టు కాద‌న‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తి రైతుల పోరాటం వృథా కాద‌ని ఆయ‌న అన్నారు. సుప్రీంకోర్టులోనూ ఏపీ స‌ర్కారుకు చెంప‌పెట్టులాంటి తీర్పు వ‌స్తుంద‌న్నారు. రైతుల సంకల్పం ముందు ప్ర‌భుత్వ కుట్ర‌లు చాలా చిన్న‌వ‌ని ఆయ‌న తెలిపారు.