దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ త‌యారీదారుగా అదానీ గ్రూప్‌

17-09-2022 Sat 15:17
  • అంబుజా, ఏసీసీల‌ను టేకోవ‌ర్ చేసిన అదానీ గ్రూప్‌
  • శుక్ర‌వారంతో ముగిసిన కంపెనీల విలీనం
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ర్షం వ్య‌క్తం చేసిన అదానీ
adani group stood second largest in cement production
సంప‌ద‌లో దినదినాభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్న భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం గౌతం అదానీ... రెండు రోజుల క్రితం ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. తాజాగా రెండు కీల‌క సంస్థ‌ల‌ను టేకోవ‌ర్ చేయ‌డం ద్వారా అదానీ గ్రూప్‌ను దేశంలోనే సిమెంటు ఉత్ప‌త్తిదారుల్లో రెండో అతి పెద్ద ఉత్ప‌త్తిదారుగా నిలిపారు. సిమెంట్ త‌యారీలో తమది రెండో అతిపెద్ద సంస్థగా నిలిచిన వైనంపై శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను పెట్టిన అదానీ.. త‌న సంస్థ వృద్ధి ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

అదానీ గ్రూప్ ఇటీవ‌లే అంబుజా సిమెంట్‌, ఏసీసీ సిమెంట్ కంపెనీల‌ను టేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. నెల‌ల క్రిత‌మే మొద‌లైన ఈ ప్ర‌క్రియ శుక్ర‌వారంతో ముగిసింది. దీంతో ఆ రెండు సంస్థ‌లు అదానీ గ్రూప్‌లో విలీన‌మైపోయాయి. ఇదే విష‌యాన్ని వెల్ల‌డించిన అదానీ... రానున్న ఐదేళ్ల‌లో త‌మ ఉత్ప‌త్తిని రెండింత‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.