ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ. 60 లక్షలతో పరారైన వాహన డ్రైవర్

17-09-2022 Sat 09:28
  • వైఎస్సార్ జిల్లా కడపలో ఘటన
  • ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు నగదుతో బయలుదేరిన సిబ్బంది
  • వారు కిందికి దిగగానే వాహనంతో పరారైన డ్రైవర్
ATM Driver Fled with Rs 60 lakh Cash in Kadapa
ఏటీఎంలలో నింపాల్సిన డబ్బులున్న వాహనంతో పరారయ్యాడో  డ్రైవర్. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  నగరంలోని వివిధ ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు నింపే బాధ్యతను ఓ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం రూ. 80 లక్షల నగదుతో ఏజెన్సీ సాంకేతిక సిబ్బంది వాహనంలో బయలుదేరారు. ఓ ఏటీఎం వద్ద వాహనాన్ని ఆపిన సిబ్బంది కిందికి దిగారు. అదే అదునుగా భావించిన డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

అప్పటికే వివిధ ఏటీఎంలలో రూ. 20 లక్షలు నింపగా మిగిలిన రూ. 60 లక్షలు ఇంకా వాహనంలోనే ఉన్నట్టు సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వాహనంతో పరారైన డ్రైవర్ నగర శివారులోని వినాయకనగర్ వద్ద వాహనాన్ని వదిలేసి డబ్బులున్న పెట్టె తీసుకుని పరారయ్యాడు. సాధారణంగా వాహనంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. అయితే, ఈ వాహనంలో వారు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.