Jagan: ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది: సీఎం జగన్

  • ఏపీ అసెంబ్లీలో ఆర్థికాభివృద్ధిపై చర్చ
  • సీఎం జగన్ ప్రసంగం
  • అప్పుల గురించి వివరించిన ముఖ్యమంత్రి
  • గణాంకాలతో సహా ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్
CM Jagan speech

ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థిక పురోగతి అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సభలో సభ్యులకే కాకుండా, రాష్ట్రంలోని ప్రజలకు కూడా తెలియాలని అన్నారు. ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే అది చంద్రబాబునాయుడికే ఉండాలేమో అధ్యక్షా అంటూ వ్యంగ్యంగా అన్నారు.  

"రాష్ట్రం బాగుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఏమాత్రం బాగుండదు. వారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేరు. సంక్షేమ పథకాలకు నిధులు రాకుండా ఆగిపోతే, ఆపగలిగితే, తప్పుడు లేఖ రాసి నిధులను అడ్డుకోగలిగితే బాగుండును అనే శక్తులు ఏవో అందరికీ తెలుసు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ అభివృద్ధి పరంగా ఎంతో ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలు అమలు చేశాం. 

రాష్ట్రం అన్ని విధాలా బాగున్నా గానీ, రాష్ట్రం ఏమాత్రం బాగాలేదని, ఇబ్బందుల్లో ఉందని, మరో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసే ఓ బ్యాచ్ ఉంది. ఇదంతా ఓ దొంగల బ్యాచ్. దోచుకో, పంచుకో, తినుకో అనే ఈ బ్యాచ్ లో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో పాటే దత్తపుత్రుడు కూడా అంతోఇంతో వాళ్లకు తోడుగా ఉన్నాడు. వాళ్లకున్న పత్రికలు, చానళ్లతో ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

జగన్ ప్రసంగం హైలెట్స్ ఇవిగో...

  • చంద్రబాబు హయాంలో జీడీపీ 5.36 ఉంది. 
  • మా హయాంలో దేవుడి దయతో ఆ జీడీపీ 2019-20లో 6.89 శాతానికి పెరిగింది.
  • తద్వారా ఏపీ దేశంలోనే 6వ స్థానంలో నిలిచింది.
  • చంద్రబాబు హయాంలో జీడీపీ పరంగా చూస్తే రాష్ట్రం 21వ స్థానంలో ఉంది.
  • 2021-22లో చూస్తే ఏపీ జీడీపీ 11.34 శాతం పెరుగుదలతో దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది.
  • 2014 నుంచి 2019 మధ్య కాలంలో దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 4.45 శాతం మాత్రమే.
  • మా హయాంలో 2019 నుంచి 2022 వరకు ఈ మూడేళ్లలోనే అది 5 శాతానికి పెరిగింది.
  • కొవిడ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా జీడీపీ తగ్గుదల నమోదైంది. 
  • ప్రపంచమంతా జీడీపీ పరంగా ప్రతికూలత ఎదుర్కొంటున్నా, దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రతికూలత ఎదుర్కొంటున్నా... నాలుగైదు రాష్ట్రాలు మాత్రం మెరుగైన జీడీపీ నమోదు చేశాయి. అలాంటివాటిలో ఏపీ ఒకటి అని చెప్పడానికి గర్వపడుతున్నాం.
  • ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్ పడిపోకుండా కాపాడేలా మన ప్రభుత్వం రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా చర్యల వల్ల, సరైన సమయాల్లో పేదవర్గాలను కాపాడడం, నాడు-నేడు, మూలధన పెట్టుబడులు, వ్యయం పెంచడం, గృహ నిర్మాణం, మౌలిక వసతుల పెంపు వంటి ఇతరత్రా కార్యక్రమాల కాంబినేషన్ ద్వారా ఏపీ సానుకూల అభివృద్ధి రేటు నమోదు చేయగలిగింది. 
  • గతంలో ఎన్నడూ లేనంతగా అప్పులు చేస్తోందని, అప్పుల్లో కూరుకుపోతోందని ఎల్లో మీడియా, చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. దీంట్లో వాస్తవాలు ఏంటో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
  • 2014లో రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పు రూ.1,20,556 కోట్లు.
  • 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయేనాటికి అప్పు విలువ రూ.2,69,462 కోట్లు
  • ఇవన్నీ కాగ్ లెక్కల ప్రకారం నమోదైన గణాంకాలు.
  • చంద్రబాబు హయాంలో అప్పులు 123 శాతం పెరిగితే, మా హయాంలో మూడేళ్లలో 41.83 శాతం పెరిగాయి.
  • ఎల్లో మీడియాలో ఈ వాస్తవాలను ఎందుకు రాయరు?
  • అదే సమయంలో కేంద్రంతో పోల్చితే ఏపీ అప్పు తగ్గింది.
  • 2014-15లో కేంద్రం అప్పులు రూ.62,42,220 కోట్లు.
  • 2020-21లో కేంద్రం అప్పులు రూ.120 లక్షల కోట్లు.
  • ఇవన్నీ ఎంఓఎస్పీ నివేదికలో వెల్లడైన అంశాలు.
  • రాష్ట్ర విభజనకు ముందు 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు రూ.59,09,965 కోట్లు.
  • 2019 మే 31 నాటికి ఆ రుణం రూ.94,49,372 కోట్లకు చేరింది.
  • ఆ ఐదేళ్లలో కేంద్రం అప్పులు 59.88 శాతం పెరిగాయి.
  • మన బుద్ధిమంతుడు చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో చూస్తే...  2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం రూ.2.69 లక్షల కోట్లకు పెరిగింది.
  • కేంద్రం అప్పులు 2019 నాటికి రూ.94,49,372 కోట్లు కాగా, 2022 మార్చి 31 నాటికి అవి ఏకంగా రూ.135 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయి.
  • రాష్ట్ర రుణాలను ఒక్కసారి గమనిద్దాం.
  • 2019 మే 31 నాటికి రూ.2.69 లక్షల కోట్లుగా ఉన్న రుణం, ఈ మూడేళ్లలో ఉన్న రుణం రూ.3.82 లక్షల కోట్లకు పెరిగింది. అంతే ఏపీ అప్పుల పెరుగుదల కేవలం 12.73 శాతం మాత్రమే.

More Telugu News