మూవీ రివ్యూ: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'

16-09-2022 Fri 15:13
  • ఈ శుక్రవారమే విడుదలైన సినిమా
  • కిరణ్ అబ్బవరం జోడీగా ఇద్దరు కథానాయికలు  
  • అంతగా ఆకట్టుకోని కథాకథనాలు
  • సంగీత పరమైన సందడి అంతంత మాత్రమే  
  • హీరో హీరోయిన్లపైనే పూర్తి ఫోకస్ 
  • తేలిపోయిన మిగతా పాత్రలు 
Nenu Meeku Baga Kavalsinavadini movie review
కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందింది. కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ముందు కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఆకట్టుకుందా లేదా? అనేది చూద్దాం. 

వికాస్ (కిరణ్ అబ్బవరం) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓ సంస్థలో పనిచేస్తున్న తేజు ( సంజన ఆనంద్) ప్రతి రోజూ విపరీతంగా తాగుతూ ఉంటుంది. వికాస్ ఆమెను తన క్యాబ్ లోనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. ప్రేమ అనే మాట వింటేనే ఆమె భగ్గున మండిపడుతుండటం అతను గమనిస్తాడు. తాగేసి ఆ మత్తులోనే ఇంటికి వెళ్లే ఆమెపై కొంతమంది రౌడీగాళ్లు కన్నేస్తే, కాపాడే బాధ్యతను కూడా వికాస్ తన భుజాలపై వేసుకుంటాడు. అలాంటి ఓ సంఘటన నుంచి తేజుని కాపాడిన వికాస్, ప్రేమ అనే మాట వినగానే ఆమెకి కోపం రావడానికి, తాగుడికి బానిస కావడానికి కారణం ఏమిటని అడుగుతాడు. 

దాంతో  తేజు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులు .. బాబాయ్ - పిన్ని .. అక్కాబావలు .. ఉన్న అందమైన ఫ్యామిలీలో తేజు జీవితం ఆనందంగా గడిచిపోతుంటుంది. ఆమె అంటే తండ్రి (ఎస్వీ కృష్ణారెడ్డి)కి ప్రాణం. ఆ ఇంట్లో యువరాణిగా ఉన్న ఆమెను మరో ఇంటికి మహారాణిగా చేయాలని ఆయన కలలు కంటూ ఉంటాడు. ఆమెకి ఆయన ఒక మంచి సంబంధం చూస్తాడు. అప్పటికే ఒక వ్యక్తిని ప్రేమించిన తేజు, మరి కాసేపట్లో పెళ్లి అనగా అతనితో వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆమె ఫ్లాష్ బ్యాక్ విన్న వికాస్ ఏం చేస్తాడు? అనేదే కథ. 

దర్శకుడు శ్రీధర్ గాదె విషయానికి వస్తే ఆయన రాసుకున్న ఈ కథ అంత గొప్పదేం కాదు. ఇంతవరకూ ఎక్కడా విననిది .. చూడనిది కూడా కాదు. ఏవో రెండు ట్విస్టులు పట్టుకుని వాటి చుట్టూ అల్లుకున్న కథలా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ పైనే ఆయన పూర్తిగా ఫోకస్ చేశాడు. ఎస్వీ కృష్ణారెడ్డి పాత్ర సహా ఏ పాత్రను కూడా ఆసక్తికరంగా మలచడానికి ప్రయత్నించలేదు. ఏ సన్నివేశం కూడా మనసుకి పట్టుకోదు. లవ్ .. ఎమోషన్ .. కామెడీ  .. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా కనిపించవు. 

హీరోయిన్ వేరొకరితో నడిచిన తన లవ్ మేటర్ ని హీరోకి చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళుతుంది .. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ గా ఇంటర్వెల్ పడుతుంది. ఫస్టాఫ్ అంతా కూడా హీరోలేని హీరోయిన్ లవ్ ట్రాక్ నడపడమే ఈ సినిమాకి పెద్ద మైనస్. పోనీ ఇద్దరి మధ్యా విశ్రాంతి వరకూ ఓ ముద్దూ లేదు .. ముచ్చటా లేదు, సెకండాఫ్ లో నైనా ఆ రెండూ ఉంటాయా అంటే అదీ లేదు. అందుకు కారణం హీరోగారి ఫ్లాష్ బ్యాక్. అటు హీరోయిన్ వైపు నుంచి ఒక లవ్ స్టోరీ .. ఒక ట్విస్ట్. ఇటు హీరో వైపు నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ .. ట్విస్ట్ .. ఇదే కథ. 

ఇంతా జరిగితే ఎవరి ఫ్లాష్ బ్యాక్ లోను పట్టూ లేదు .. పసా లేదు. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లేను .. డైలాగ్స్ ను కిరణ్  అబ్బవరం అందించడం విశేషం. కాకపోతే స్క్రీన్ ప్లే లో పట్టులేదు .. సంభాషణల్లో గుర్తుపెట్టుకునేవి ఏమీ లేవు. సెకండాఫ్ లో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదుగానీ, బాబా మాస్టర్ ఈజ్ చూస్తే ఆయనను కమెడియన్ గా వాడుకోవచ్చు అనే విషయం మాత్రం అర్థమవుతుంది. హీరోయిన్ సంజనా యాక్టింగ్ ఫరవాలేదు. ఇక మిగతా ఆర్టిస్టులంతా పేరుకు పెద్దలు అన్నట్టుగా కనిపిస్తారంతే. 

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన బాణీల్లో ఒకటి .. రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను కొంతవరకూ ఆదుకోగలిగింది. కెమెరా పనితనం .. ఎడిటింగ్ ఓకే. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో తనకంటూ ఒక స్టయిల్ ను సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపించాడు. మాస్ పాటలకు మంచి ఈజ్ తో స్టెప్పులు వేశాడు. కామెడీపై కూడా కాస్త పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి. అతను వరుస సినిమాలు చేస్తుండటం అభినందించదగిన విషయమే. కాకపోతే కథలో ఎంత విషయం ఉందనేది పట్టించుకోకపోవడమే అసలు సమస్య.   

--- పెద్దింటి గోపీకృష్ణ