సమస్యలపై ప్రశ్నిస్తే ప్రధాని మోదీ చిరుతను మించిన వేగంతో పారిపోతారు: ఒవైసీ

15-09-2022 Thu 13:28 | National
  • జైపూర్ లో ఒవైసీ రోడ్ షో
  • ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటన
  • సమస్యలపై ప్రశ్నిస్తే మోదీ తప్పించుకుంటారని వ్యాఖ్యలు
Asaduddin Owaisi take swipe at PM Modi
ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

సమస్యలపై ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోదీ చిరుతను మించి వేగంగా పరుగెత్తగలరని ఎద్దేవా చేశారు. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి వచ్చిన చిరుతల నడుమ ప్రధాని మోదీ తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒవైసీ పైవిధంగా స్పందించారు. 

"మీరు ఎప్పుడైనా మోదీని నిరుద్యోగం, లేక భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలపై అడిగి చూడండి... ఆయన చిరుత కంటే వేగంగా పరుగు తీస్తారు. ఆయనను మేం ఆగమని చెబుతున్నాం. అడిగే ప్రశ్నలకు నిలిచి జవాబు ఇవ్వమంటున్నాం. భారత భూభాగంపై చైనా ఎలా దురాక్రమణలకు పాల్పడుతోందో చెప్పమంటున్నాం" అని ఒవైసీ వ్యాఖ్యానించారు. 

హాస్యం కూడా రాజకీయాల్లో భాగమేనని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారని, అందుకే ఆయనపై చిరుతపులి వ్యాఖ్యలు సరదాగా చేశానని తెలిపారు.