లాతూర్ జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు.. భయంతో నిద్రకు దూరమైన గ్రామస్థులు

15-09-2022 Thu 09:12 | National
  • వారం రోజులుగా ఆగకుండా వస్తున్న శబ్దాలు
  • అధ్యయనానికి సిద్ధమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం
  • భూకంపం సంభవించకున్నా శబ్దాలు వస్తుండడంతో భయంభయంగా గ్రామస్థులు
Mysterious underground sounds at Latur village without seismic activity
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఓ గ్రామంలో భూమి లోంచి వస్తున్న వింత శబ్దాలు జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి. వారం రోజులుగా హసోరీ గ్రామంలో భూమిలో నుంచి వస్తున్న ఈ శబ్దాల గురించి తెలుసుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం, నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీ నిపుణులు ఈ వింత శబ్దాలపై అధ్యయనం చేయనున్నట్టు ప్రకటించారు. 

భూకంపం సంభవించకున్నా వారం రోజులుగా ఆగకుండా భూమి నుంచి శబ్దాలు వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. కాగా, హసోరి గ్రామానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిల్లారీలో 1993లో సంభవించిన భారీ భూకంపంలో 9,700 మంది ప్రాణాలు కోల్పోయారు.