Partha Chatterjee: కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Want to live in peace Partha Chatterjee and aide Arpita break down in court
  • స్కూల్ జాబ్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ
  • తనకు ప్రశాంతంగా జీవించాలని ఉందన్న మాజీ మంత్రి
  • అంత డబ్బు తన ఇంట్లో ఎలా దొరికిందో తెలియదన్న అర్పితా ముఖర్జీ
స్కూల్ జాబ్స్ కుంభకోణంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను నిన్న కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో పార్థా ఛటర్జీ మాట్లాడుతూ.. తనకు ప్రశాంతంగా జీవించాలని ఉందని, బెయిలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. 

ప్రజల్లో తన ఇమేజ్ గురించి ఆందోళన చెందుతున్నట్టు చెప్పిన ఆయన.. తాను ఎకనమిక్స్, ఎల్ఎల్‌బీ విద్యార్థినని కోర్టుకు తెలిపారు. తాను బ్రిటిష్ స్కాలర్‌షిప్ కూడా అందుకున్నట్టు చెప్పారు. ఉన్నత విద్య చదివిన తాను ఇలాంటి కుంభకోణంలో భాగం ఎలా అవుతానని వాపోయారు. తాను మంత్రిని కాకముందు ప్రతిపక్ష నేతనని, ఇప్పుడు రాజకీయాలకు బలయ్యానని అన్నారు. ఇకపై ప్రశాంత జీవితం గడపాలని ఉందన్న ఆయన అందుకోసం బెయిలు ఇవ్వాలని అభ్యర్థించారు.

పార్థా ఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ కూడా కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. ఈడీ అధికారులకు తన ఇంట్లో అంత డబ్బు ఎలా దొరికిందో అర్థం కావడం లేదని వాపోయారు. దీంతో కల్పించుకున్న న్యాయమూర్తి.. ‘ఆ ఇంటి యజమాని మీరే కదా?’ అని ప్రశ్నించారు. దానికి అర్పిత ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. ‘అయితే అంత డబ్బు ఎలా పట్టుబడిందన్న ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలని’ న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పార్థా ఛటర్జీ, అర్పిత ముఖర్జీకి మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
Partha Chatterjee
West Bengal
School Jobs Scam
Arpita Mukherjee

More Telugu News