Bollywood: ఢిల్లీ పోలీసుల ఎదుట విచార‌ణకు హాజ‌రైన న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

bollywood actress Jacqueline Fernandez attends delhi police enquiry
  • సుఖేశ్‌తో స‌న్నిహిత్వంతో జాక్వెలిన్‌పై కేసు
  • నేడు 8 గంట‌ల పాటు కొన‌సాగ‌నున్న విచార‌ణ‌
  • రేపు, ఎల్లుండి కూడా న‌టిని ప్ర‌శ్నించనున్న పోలీసులు
మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్ర‌శేఖర్‌తో స్నేహం, అత‌డి నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ను అందుకున్న బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోలీసుల విచార‌ణ‌కు హాజరు అయ్యారు. ఈ కేసులో త‌మ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగం రెండు రోజుల క్రితం జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల‌కు అనుగుణంగానే జాక్వెలిన్ బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీలోని ఎక‌న‌మిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాల‌యానికి చేరుకున్నారు.

విచార‌ణ‌లో భాగంగా జాక్వెలిన్‌కు సంధించాల్సిన ప్ర‌శ్నావ‌ళిని ఇప్ప‌టికే సిద్ధం చేసిన ఢిల్లీ పోలీసులు... నేడు ఆమెను రాత్రి 8 గంట‌ల దాకా విచారించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా రేపు, ఎల్లుండి కూడా జాక్వెలిన్‌ను పోలీసులు విచారించ‌నున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేసుకోవాల‌ని పోలీసులు జాక్వెలిన్‌కు సూచించారు. సుఖేశ్ కేసులో జాక్వెలిన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కేసు న‌మోదు చేశాక ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బుధ‌వారం నాటి విచార‌ణ‌కు జాక్వెలిన్‌తో పాటు ఆమెను సుఖేశ్‌కు ప‌రిచ‌యం చేసిన పింకీ ఇరానీ కూడా హాజ‌ర‌య్యారు.
Bollywood
Jacqueline Fernandez
Enforcement Directorate
Delhi Police

More Telugu News