వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డి నేటి యువతకు ఆదర్శం: చంద్రబాబు

  • సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళుతున్న దురంతో రైలు
  • మార్గమధ్యంలోనే ఓ గర్భిణీకి పురిటినొప్పులు
  • అదే బోగీలో ప్రయాణిస్తున్న వైద్యవిద్యార్థిని స్వాతిరెడ్డి
  • ఇతర మహిళల సాయంతో పురుడు పోసిన వైనం
  • స్వాతిరెడ్డిని అభినందించిన చంద్రబాబు
Chandrababu appreciates Medico Swathi Reddy

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ఓ మహిళ బిడ్డను ప్రసవించిన సంగతి తెలిసిందే. రైలు ప్రయాణిస్తుండగానే ఆమెకు పురిటినొప్పులు రావడంతో, అదే బోగీలో ప్రయాణిస్తున్న స్వాతిరెడ్డి అనే వైద్య విద్యార్థిని ఇతర మహిళల సాయంతో ఆ గర్భిణీకి పురుడు పోశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ స్వాతిరెడ్డిని అభినందించారు. స్వాతిరెడ్డి విశాఖలోని గీతం మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. చదవిన చదువు సమాజానికి ఉపయోగపడినప్పుడే ఆ చదువుకు సార్థకత అని స్వాతి రెడ్డి నిరూపించిందని కొనియాడారు. నేటి యువత స్వాతిరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

దురంతో ఎక్స్ ప్రెస్ లో గర్భిణీకి కాన్పు చేసి తల్లీబిడ్డలను కాపాడిన వైద్య విద్యార్థిని స్వాతిరెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ ను కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.
.

More Telugu News