Rahul Gandhi: వర్షంలో గొడుగు వేసుకోకుండానే రాహుల్ పాదయాత్ర.. కాళ్లు బొబ్బలెక్కినా ఆపేది లేదన్న కాంగ్రెస్ నేత

Feet blisters will not stop us we will unite India says Rahul
  • ఐక్యత సాధించేందుకు సంకల్పించామన్న రాహుల్
  • యాత్రలో తొలి 100 కిలోమీటర్లు పూర్తయిందన్న కాంగ్రెస్ అగ్రనేత
  • కల్లంబల్లం వద్ద జరిగిన సభలో బీజేపీపై మండిపాటు
  • ఓంశాంతికి బదులు అశాంతి రేకెత్తిస్తోందని ఆగ్రహం
కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిన్న వర్షంలోనే కొనసాగింది. చిరు జల్లులు పడుతున్నా రాహుల్ సహా ఎవరూ గొడుగులు లేకుండానే ముందుకు నడిచారు. నిన్న కనియపురం వద్ద యాత్ర మొదలైంది. నాయకులంతా ఉత్సాహంగా రాహుల్ వెంట నడిచారు. రహదారికి ఇరువైపులా బారులుదీరిన జనం రాహుల్‌కు అభివాదం చేశారు. సాయంత్రం కల్లంబల్లం వద్ద జరిగిన భారీ సభలో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. హిందుత్వం ఓం శాంతి అని ప్రబోధిస్తోందని, బీజేపీ మాత్రం దానికి వ్యతిరేకంగా దేశమంతా అశాంతి రేకెత్తిస్తోందని విమర్శించారు. సామరస్యాన్ని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతకుముందు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన రాహుల్.. భారత్ కల చెదిరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నం ఇప్పుడే మొదలైందని, తొలి 100 కిలోమీటర్ల యాత్ర పూర్తయిందని అన్నారు. ఐక్యత సాధించేందుకు సంకల్పించామని, ఈ క్రమంలో నడిచినడిచి కాళ్లు బొబ్బలెక్కినా అడుగు ముందుకే వేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
Rahul Gandhi
Bharat Jodo Yatra
Congress

More Telugu News