Uttar Pradesh: ఎన్‌కౌంటర్ చేయొద్దంటూ మెడలో బోర్డు తగిలించుకుని.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హత్యకేసు నిందితుడు

Goon Who Accused In A Murder Case Surrender with Placard In Ups Ghaziabad
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ నెల 9న ఒకరి హత్య
  • ఈ కేసులో ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరారీలో
  • అవసరమైతే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని ఎస్పీ ప్రకటన
  • భయంతో మెడలో బోర్డుతో ప్రత్యక్షమైన నిందితుడు
తాను లొంగిపోతున్నానని, ఎన్‌కౌంటర్ చేయొద్దంటూ ఓ హత్యకేసు నిందితుడు మెడలో బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. నేరాలకు పాల్పడితే ఎన్‌కౌంటర్లు తప్పవన్న హెచ్చరికలతో ఇప్పటికే పలువురు లొంగిపోయారు. ఈ క్రమంలో ఈ నెల 9న ఘజియాబాద్‌లో ఓ హత్య జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు సోహైల్‌ను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఎస్పీ ఓ ప్రకటన చేశారు. అవసరమైతే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. అంతే, అది విన్న నిందితుడు సోహైల్ ఎన్‌కౌంటర్ తప్పదని భయపడిపోయాడు. ఇక తప్పించుకుని లాభం లేదని పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలో మెడకు ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. తాను లొంగిపోతున్నానని, మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడబోనని, తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని వేడుకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Uttar Pradesh
Ghaziabad
Murder Case

More Telugu News