Karnataka: ప్రగతి భవన్​ కు వచ్చిన కుమారస్వామి.. కేసీఆర్​ తో భేటీ.. స్వాగతం వీడియో ఇదిగో

  • స్వయంగా స్వాగతం పలికిన కేసీఆర్, మంత్రులు 
  • కలిసి భోజనం చేసిన నేతలు.. తర్వాత భేటీ అయి చర్చ
  • కేసీఆర్ కొత్త పార్టీ, జాతీయ రాజకీయాలపై చర్చించుకున్న నేతలు
  • వీడియో, ఫొటోలను ట్విట్టర్ లో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ
Karnataka ex cm Kumaraswami met Telangana CM Kcr

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ కు వచ్చారు. సీఎం కేసీఆర్, పలువురు నేతలు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్, కుమారస్వామి కలిసి భోజనం చేశారు. అనంతరం భేటీ అయి చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులు, దేశంలో రాజకీయ పరిణామాలపై వారు మాట్లాడుకున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్టు సమాచారం.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రపై చర్చించారన్న టీఆర్ఎస్ పార్టీ
 కేసీఆర్, కుమారస్వామి భేటీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో వివరాలను పోస్టు చేసింది. ‘‘తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, ప్రస్థుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పోషించవలసిన కీలక పాత్ర.. తదితర జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి చర్చించుకుంటున్నారు” అని పేర్కొంది.

కేటీఆర్ గొప్ప విజన్ ఉన్న నేత: కుమారస్వామి
ప్రగతి భవన్ కు వచ్చిన కుమారస్వామి మంత్రి కేటీఆర్ తోనూ చర్చించారు. అనంతరం కేటీఆర్ ను కలిసిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కేటీఆర్ తో చర్చలు జరిపానని.. ఆయన అభివృద్ధి పట్ల గొప్ప విజన్ ఉన్న నేత అని కుమారస్వామి పేర్కొన్నారు.

ఇంతకుముందే చర్చ
సీఎం కేసీఆర్ గతంలోనే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామిలతో చర్చించారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ పాలనపై విమర్శలు చేస్తూ.. తనతో కలిసి రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన కుమారస్వామి కేసీఆర్‌ తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News