Krishnam Raju: కృష్ణంరాజుతో 50 ఏళ్ల స్నేహం నాది: కృష్ణ

Superstar Krishna remembers his friendship with Krishnamraju
  • రెబల్ స్టార్ అస్తమయం
  • విషాదంలో టాలీవుడ్
  • ప్రగాఢ సంతాపం తెలిపిన కృష్ణ
  • కృష్ణంరాజు మనమధ్య లేకపోవడం దురదృష్టకరమని వెల్లడి
రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్తమయంతో తెలుగు చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ మేటి నటుడితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రముఖులు జ్ఞాపకాల సుడిలో ఆవేదనాభరితులవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తామిద్దరిదీ 50 సంవత్సరాలు స్నేహబంధం అని వెల్లడించారు.  

నాడు 'తేనె మనసులు' చిత్రం ఆడిషన్స్ కు వచ్చినవారిలో కృష్ణంరాజు కూడా ఉన్నాడని గుర్తుచేసుకున్నారు. తాను 'తేనె మనసులు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తే, 'చిలకాగోరింక' చిత్రంతో కృష్ణంరాజు నటుడిగా ఎంట్రీ ఇచ్చాడని వెల్లడించారు. 

తాను హీరోగా వచ్చిన 'నేనంటే నేనే' చిత్రంలో కృష్ణంరాజు ప్రతినాయకుడిగా నటించాడని తెలిపారు. కృష్ణంరాజు హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇంద్రభవనం, యుద్ధం, అడవి సింహాలు, విశ్వనాథనాయకుడు వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించామని కృష్ణ వివరించారు. తాను హీరోగా, కృష్ణంరాజు సెకండ్ హీరోగా నటించిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పారు. 

కృష్ణంరాజు ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని, ఆయన మనమధ్య లేకపోవడం దురదృష్టకరమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Krishnam Raju
Krishna
Rebel Star
Tollywood

More Telugu News