Krishnam Raju: కృష్ణంరాజు మృతికి కారణమిదే: వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు

This is the reason behind Tollywood actor Krishnam raju death
  • మధుమేహం, పోస్ట్ కొవిడ్, కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారన్న ఆసుపత్రి వర్గాలు
  • గత నెల 5న ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు
  • అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందించామన్న వైద్యులు
  • నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనున్న కృష్ణంరాజు పార్థివదేహం.. రేపు అంత్యక్రియలు
అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి గల కారణాలను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన కన్నుమూసినట్టు పేర్కొన్నాయి. గుండె కొట్టుకునే వేగం విషయంలో చాలా కాలంగా ఆయన సమస్య ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని వివరించారు.

కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఈ తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కృష్ణంరాజు పార్థివదేహాన్ని నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయి.
Krishnam Raju
Tollywood
AIG Hospital
Hyderabad

More Telugu News