ఎంజే మార్కెట్ ఘ‌ట‌న‌పై అసోం సీఎం స్పంద‌న ఇదే

  • హైద‌రాబాద్ శోభా యాత్ర‌లో పాల్గొన్న హిమంత బిశ్వ శ‌ర్మ‌
  • ఎంజే మార్కెట్ వ‌ద్ద ఆయ‌న ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌
  • అతిథి దేవోభవ సంస్కృతికి విరుద్ధ‌మ‌న్న బిశ్వ శ‌ర్మ‌
assam cm Himanta Biswa Sarma responds on mj market issue

హైద‌రాబాద్‌లో వేడుక‌గా జ‌రిగిన గ‌ణేశ్ శోభా యాత్ర‌లో పాలుపంచుకునేందుకు భాగ్య న‌గ‌రికి వ‌చ్చిన అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌కు శుక్ర‌వారం చేదు అనుభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. శోభా యాత్ర‌లో భాగంగా న‌గ‌రంలోని ఎంజే మార్కెట్ వ‌ద్ద భాగ్య న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి శ‌ర్మ ప్ర‌సంగిస్తుండ‌గా... ఆయ‌న ప్ర‌సంగాన్ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త నందూ బిలాల్ అడ్డుకునే య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు స‌కాలంలో స్పందించ‌డంతో పెద్ద గొడ‌వే త‌ప్పింది. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం అసోం వెళ్లిపోయిన హిమంత తాజాగా శ‌నివారం ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. 

శోభా యాత్ర‌లో పాల్గొనేందుకు వెళ్లిన త‌న‌పై హైద‌రాబాద్‌లో దాడి య‌త్నం జ‌రిగింద‌ని హిమంత బిశ్వ శ‌ర్మ అన్నారు. ఓ రాజ‌కీయ పార్టీ కార్య‌క‌ర్త‌గా ఉన్న వ్య‌క్తి ఇలా చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. నిందితుడిపై తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌న‌పై జ‌రిగిన దాడి య‌త్నం అతిథి దేవోభ‌వ అనే భార‌త సంస్కృతికి విరుద్ధం అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News