Serum Institute: అదార్ పూనావాలా పేరుతో సందేశాలు... సీరం ఇన్ స్టిట్యూట్ కు కోటి రూపాయలకు టోకరా వేసిన ఘరానా మోసగాళ్లు

  • సీరంకు సీఈవోగా వ్యవహరిస్తున్న అదార్ పూనావాలా
  • అదార్ పేరిట సీరం డైరెక్టర్ కు వాట్సాప్ మెసేజ్
  • కోటి రూపాయలు నగదు బదిలీ చేయాలంటూ సందేశం
  • ఆన్ లైన్ లో బదిలీ చేసిన సంస్థ డైరెక్టర్
  • ఆపై మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
Fraudsters cheats Serum Institute of India more than one crore rupees

కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ సమకూర్చి వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో తోడ్పాటు అందించిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తాజాగా మోసగాళ్ల బారినపడింది. ఘరానా మోసగాళ్లు సీరం ఇన్ స్టిట్యూట్ ను కోటి రూపాయలకు పైగా టోకరా వేశారు. అది కూడా సీరం ఇన్ స్టిట్యూట్ అధినేత, సీఈవో అదార్ పూనావాలా పేరిట సందేశాలు పంపించి, తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు పోలీసుల విచారణలో వెల్లడైంది.

దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చీటింగ్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కాగా, సీరం ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్లలో ఒకరైన సతీశ్ దేశ్ పాండేకు బుధ, గురువారాల్లో సంస్థ సీఈవో అదార్ పూనావాలా పేరిట వాట్సాప్ సందేశాలు వచ్చాయి. 

కొన్ని బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేయాల్సిందిగా అదార్ పూనావాలా కోరుతున్నట్టు ఆ సందేశాల్లో ఉంది. దాంతో, సతీశ్ దేశ్ పాండే ఆ సందేశాలు పంపింది తమ సీఈవోనే అని నమ్మి వెంటనే రూ.1,01,01,554 ఆన్ లైన్ లో బదిలీ చేశారు. 

అయితే, అదార్ పూనావాలా ఇలాంటి సందేశాలు వాట్సాప్ లో పంపరన్న విషయం ఆ తర్వాత గుర్తుకు రావడంతో సతీశ్ దేశ్ పాండే అప్రమత్తమయ్యారు. సీరం ఇన్ స్టిట్యూట్ ఫైనాన్స్ మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News