Australia: ఫించ్ అనూహ్య నిర్ణయం.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ స్టార్ క్రికెటర్

  • కివీస్‌తో ఆదివారం చివరి వన్డే ఆడనున్న ఫించ్
  • 145 వన్డేల్లో 5,401 పరుగులు 
  • 17 సెంచరీలతో రికీపాంటింగ్ తర్వాతి స్థానం
  • టీ20 కెప్టెన్‌గా కొనసాగనున్న స్టార్ క్రికెటర్
Australia Star Cricketer Aaron Finch Announces Retirement From ODIs

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తూ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫించ్ అకస్మాత్తు నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్ ఆదివారం న్యూజిలాండ్‌తో తన చివరి వన్డే ఆడనున్నాడు. ఇప్పటి వరకు 145 వన్డేలు ఆడిన ఫించ్ 17 సెంచరీలతో 5,401 పరుగులు చేశాడు. సెంచరీల్లో రికీపాంటింగ్ (29) తర్వాతి స్థానం ఫించ్‌దే. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్, మార్క్ వా (18) ఉన్నారు.

వన్డేల నుంచి తప్పుకున్న ఫించ్ టీ20లకు మాత్రం సారథిగానే ఉంటాడు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించనున్నాడు. 54 వన్డేల్లో ఆసీస్‌కు సారథ్యం వహించిన ఫించ్.. ఈ అద్భుత ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకున్నట్టు చెప్పాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుకు సారథ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. తనతో కలిసి ఆడినవారితోపాటు తెరవెనక ఎంతోమంది ఆశీస్సులు తనకు ఉన్నాయన్నాడు. 

ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుండడమే ఫించ్ రిటైర్మెంట్ ప్రకటనకు కారణమని తెలుస్తోంది. వన్డేల్లో ఫించ్ ఇటీవల వరుసగా 5, 5, 1, 15, 0, 0, 0 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వన్డేల నుంచి తప్పుకుని టీ20లపైనే పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ జట్టుకు సారథ్యం వహించాలని భావించాడు. తన లక్ష్యం కూడా అదేనని రెండేళ్ల క్రితం పేర్కొన్నాడు కూడా. అంతలోనే అతడు అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

వచ్చే ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు, విజయం సాధించేందుకు కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన నిర్ణయమని ఫించ్ చెప్పుకొచ్చాడు. తన ఈ ప్రయాణంలో తనకు మద్దతు ఇచ్చి తన వెనక నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

More Telugu News