అసోం సీఎం మాట్లాడుతుండగా మైక్‌ను లాగేసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌... ఏంజే మార్కెట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

  • గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ ఆహ్వానంతో హైద‌రాబాద్ వ‌చ్చిన హిమంత బిశ్వ శ‌ర్మ‌
  • ఏంజే మార్కెట్ వ‌ద్ద ప్ర‌సంగించిన శ‌ర్మ‌
  • కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఆగ్ర‌హం
  • వేదిక ఎక్కి శ‌ర్మ మైక్‌ను లాగేసుకున్న వైనం

హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం శోభాయ‌మానంగా జ‌రుగుతున్న గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా న‌గ‌రంలోని ఎంజే మార్కెట్ వ‌ద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. భాగ్య‌న‌గ‌రి గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ ఆహ్వానం మేర‌కు న‌గ‌రంలోని గ‌ణేశ్ నిమజ్జ‌నంలో పాలుపంచుకునేందుకు బీజేపీ నేత‌, అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ ప్ర‌సంగాన్ని టీఆర్ఎస్‌కు చెందిన నందుబిలాల్‌ అనే కార్య‌కర్త అడ్డుకునేందుకు య‌త్నించాడు. అయితే వెనువెంట‌నే నందుబిలాల్‌ను నిలువ‌రించిన గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ, హైద‌రాబాద్ పోలీసులు అత‌డిని అక్క‌డి నుంచి త‌ర‌లించారు. 

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం చార్మినార్ ప్రాంతంలోని భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన హిమంత బిశ్వ శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత మొజాం జాహీ మార్కెట్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. మార్కెట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన వేదిక ఎక్కిన శ‌ర్మ‌... త‌న ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి శ‌ర్మ వెనుక నుంచి నందుబిలాల్‌ చొచ్చుకు వ‌చ్చాడు. శ‌ర్మ ముందున్న మైక్‌ను త‌న చేతిలోకి తీసుకున్న అత‌డు శ‌ర్మ‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్త‌మైన గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ స‌భ్యుల‌తో పాటు పోలీసులు నందుబిలాల్‌ను అక్క‌డి నుంచి కింద‌కు దించి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత శ‌ర్మ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News