Sharwanand: మూవీ రివ్యూ: 'ఒకే ఒక జీవితం'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'ఒకే ఒక జీవితం'
  • అమ్మ పాత్రలో మెప్పించిన అమల అక్కినేని 
  • అంతగా ప్రాధాన్యతలేని పాత్రలో రీతూ వర్మ 
  • నిదానంగా నడిచిన కథనం 
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఎక్కువ   
Oke Oka Jeevitham movie review

తెలుగు తెరపైకి ఇంతకుముందు మదర్ సెంటిమెంట్ సినిమాలు చాలానే వచ్చాయి. అలాగే 'ఆదిత్య 369' నుంచి మొన్నటి 'బింబిసార' వరకూ టైమ్ ట్రావెల్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ అటు మదర్ సెంటిమెంట్ ను .. ఇటు టైమ్ ట్రావెల్ ట్రాక్ ను కలిపేసి ఒక కొత్త పాయింటును తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందనడానికి ఉదాహరణగా నిలిచే చిత్రమే 'ఒకే ఒక జీవితం'.

శర్వానంద్ ..  రీతూ వర్మ .. అమల అక్కినేని .. వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి .. నాజర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ప్రకాశ్ బాబు .. ఎస్. ఆర్. ప్రభు నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.


ఈ కథ 1998 - 2019 మధ్య జరుగుతుంది. ఆది (శర్వానంద్),  శ్రీను (వెన్నెల కిశోర్), చైతన్య (ప్రియదర్శి) ముగ్గురూ కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ముగ్గురూ కూడా మూడు దారుల్లో ముందుకు వెళుతుంటారు. పదేళ్ల వయసులోనే కారు ప్రమాదంలో తల్లిని కోల్పోయిన ఆదికి ఆమె ప్రేమను మళ్లీ పొందే అవకాశం వస్తే బాగుండునని అనుకుంటాడు. 

అలాగే బిజినెస్ పరంగా ఇబ్బందులు పడుతున్న శ్రీను, తాను బాగా చదువుకుని ఉంటే లైఫ్ వేరేగా ఉండేదని బాధపడుతూ ఉంటాడు. ఇక తాను మంచి జాబ్ చేస్తూ ఉండుంటే మేనమామ కూతురితో తన లగ్గం కుదిరుండేదని చైతూ ఫీలవుతుంటాడు.

అలాంటి పరిస్థితుల్లోనే సైంటిస్ట్ పాల్ (నాజర్) తో ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడుతుంది. 20 ఏళ్లు కష్టపడి తాను తయారు చేసిన టైమ్ మిషన్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్లి అతని అమ్మ ప్రేమను తిరిగి పొందవచ్చుననీ, ఆమె ఆ ప్రమాదం బారిన పడకుండా కాపాడవచ్చని పాల్ చెబుతాడు. దాంతో తాము కూడా ఆదితో పాటు వెళ్లి, తమ జీవితంలోని లోపాలను సరిచేసుకుంటామని శ్రీను - చైతూ కోరతారు. అందుకు అంగీకరించిన పాల్, టైమ్ ట్రావెల్ కి సంబంధించిన జాగ్రత్తలు చెప్పి వాళ్లని కాలంలో 20 ఏళ్లు వెనక్కి పంపుతాడు.

ఆది  .. శ్రీను .. చైతూ ముగ్గురూ కూడా టైమ్ మిషన్ లో  20 ఏళ్ల క్రితం నాటి తమ ఊరికి చేరుకుంటారు. తాము పదేళ్ల వయసులో ఉండగా ఎలా ఉన్నామనేది ప్రత్యక్షంగా చూస్తారు .. స్కూల్ కి వెళ్లి వాళ్లతో మాట్లాడతారు. ఆది తన తల్లిని కలుసుకుంటాడు. పాల్ మాట మేరకు అమ్మకి అసలు సంగతి చెప్పకుండా దాస్తాడు. తల్లిని తరచూ చూడటం కోసం, చిన్నప్పటి ఆదికి మ్యూజిక్ పాఠాలు చెబుతూ ఉంటాడు. అలాగే  శ్రీను .. చైతూ కూడా తాము వచ్చిన పనుల్లో పడతారు.

అయితే అనుకోని ఒక సంఘటన కారణంగా ఆది .. శ్రీను  .. చైతూ ముగ్గురూ కూడా 1998 లోనే ఉండిపోతారు. పదేళ్ల వయసులో ఉన్న ఆ ముగ్గురు పిల్లలు మాత్రం టైమ్ మిషన్ లో 2019 కి వచ్చేస్తారు. 

టైమ్ మిషన్ లేకపోవడంతో ఆ కాలంలో ముగ్గురు యువకులు చిక్కుబడతారు. ఈ కాలానికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఇక్కడ అయోమయంలో పడతారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? తన తల్లిని ఆది కాపాడుకోగలిగాడా? చదువు విషయంలో శ్రీను, మేనమామ కూతురుతో పెళ్లి విషయంలో చైతూ అనుకున్నవి సాధించగలుగుతారా? అనే అనూహ్యమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది. 

కథ విషయానికి వస్తే .. మొదటి నుంచి చివరివరకూ కూడా ఎక్కడా గందరగోళం ఉండదు. ఒక వైపున తల్లీ కొడుకుల ఎమోషన్ .. మరో వైపు వెన్నెల కిశోర్ -  ప్రియదర్శి ట్రాక్ నుంచి కామెడీ .. ఇంకో వైపున టైమ్ ట్రావెల్ నేపథ్యం, ఈ మూడు అంశాలను క్లారిటీతో చెప్పడంలోను .. టైమ్ మిషన్ ను డిజైన్ చేయించుకునే విషయంలోను దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇటు పెద్దయిన తరువాత పాత్రలు .. అటు చిన్నప్పటి పాత్రలు రెండూ కూడా తెరపై ఒకసారి .. ఒకే ఫ్రేమ్ లో కనిపించడమనే లాజిక్కులని పక్కన పెట్టేస్తే, దర్శకుడు తాను చెప్పదలచుకున్న కథను చాలా నీట్ గా చెప్పాడు. 

అయితే హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ గానీ .. రొమాంటిక్ సాంగ్స్  గాని లేవు. అసలు దర్శకుడు ఆ వైపు వెళ్లకపోవడం ఆడియన్స్ కి నిరాశను కలిగించే విషయం. ఇక కథ చాలా నిదానంగా నడవడం, యూత్ కీ  .. మాస్ ఆడియన్స్ కి అవసరమైన అంశాలు లేకపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది. కాకపోతే సినిమాకి అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకునే ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం రెండూ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. 

ఇక ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. పాటలు ఫరవాలేదనిపిస్తాయి. సినిమాకి ఆయువుపట్టు వంటి 'అమ్మ పాట' మాత్రం గతంలో వచ్చిన అమ్మ పాటలను మరిపించలేకపోయింది. సుజీత్ సారంగ్ ఫొటోగ్రఫీ బాగుంది .. అలాగే ఎడిటింగ్ కూడా ఎక్కడా కన్ ఫ్యూజన్ లేకుండా నీట్ గా ఉంది. తరుణ్ భాస్కర్ అందించిన సంభాషణలు, సహజంగా మాట్లాడుకునేలానే ఉన్నాయి. ఆర్టిస్టులంతా కూడా ఎవరి పరిధిలో వారు చేశారు. పిల్లలు నటన కూడా చాలా సహజంగా అనిపిస్తుంది.

కాలంలో ఒకసారి వెనక్కి వెళ్లి అమ్మను కలుసుకుంటే బాగుండును అని ప్రతి ఒక్కరికీ  ఉంటుంది. అలాంటి ఒక పాయింట్ కి వాళ్లంతా తప్పకుండా కనెక్ట్ అవుతారు. కానీ కథనం చాలా స్లోగా సాగడం ..  లవ్ అండ్ రొమాన్స్ పాళ్లు లేకపోవడం  .. పాటలు అంత గొప్పగా అనిపించకపోవడం .. కాస్త అసంతృప్తిగా అనిపిస్తాయి. దర్శకుడు ఏ అంశాలను ప్రధానంగా చెప్పాలనుకున్నాడో అంతవరకూ నీట్ గా చెప్పాడు. మిగతా అంశాలను పట్టించుకోకపోవడం ఒక లోపంగా అనిపిస్తుందంతే. 

--- పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News