Venkaiah Naidu: అప్పట్లో ఓ మిషన్ కోసం పనిచేసేవారు.. ఇప్పుడు కమీషన్ కోసం పనిచేస్తున్నారు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu held get together meet in Guntur
  • ఇటీవల పదవీ విరమణ చేసిన వెంకయ్య
  • గుంటూరులో ఆత్మీయ సమావేశం
  • పలువురు నేతలు హాజరు
  • ప్రజల మధ్యన ఉండడమే తనకిష్టమన్న వెంకయ్య
  • ఆంక్షలు ఉన్నా దేశం మొత్తం తిరిగానని వెల్లడి

ఇటీవలే పదవీ విరమణ చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు గుంటూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కామినేని శ్రీనివాస్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, గతంలో పత్రికలు, విద్య, వైద్యం తదితర విభాగాలు ఓ మిషన్ కోసం నడిచేవని అన్నారు. ఇప్పుడు కమీషన్ కోసం నడుస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ప్రజల నడుమ ఉండి పనిచేయడమే తనకు ఇష్టమని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆంక్షలు పక్కనబెట్టి దేశం మొత్తం తిరిగానని తెలిపారు.

చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని హితవు పలికారు. చట్టసభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. భాష హుందాగా ఉండాలని, దుర్భాషలు వద్దని పేర్కొన్నారు. భారత్ లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. 

నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీ రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చారని, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. స్వాతంత్రోద్యమాన్ని గాంధీ ముందుండి నడిపినా, మిగతా వారి పాత్ర తక్కువేమీ కాదని స్పష్టం చేశారు. చాలామంది పోరాట యోధులకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని అభిప్రాయపడ్డారు. 

మన మాతృభాషకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని, పరిపాలన తెలుగులో ఉండాలని పిలుపునిచ్చారు. మాతృభాషలో చదివి అత్యున్నత స్థానాలకు ఎదిగినవారున్నారని గుర్తుచేశారు. మాతృభాషలో చదవాలి... ఇంగ్లీషు, హిందీతో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News