Venkaiah Naidu: తల్లి ప్రేమను పొందలేకపోయాను.. నన్ను పార్టీయే పెంచి పోషించింది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Could not get mothers love Party raised me says Venkaiah Naidu
  • అలాంటి పార్టీకి రాజీనామా చేయడం బాధకలిగించిందన్న మాజీ ఉపరాష్ట్రపతి
  • ఉప రాష్ట్రపతి పదవీ విరమణ చేశాకే తిరిగి స్వతంత్రుడినయ్యానని వ్యాఖ్య
  • జిల్లాల వారీగా పాత మిత్రులను కలుసుకుంటానన్న వెంకయ్య
తల్లి ప్రేమను పొందలేకపోయిన తనను పెంచి పోషించిన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం చాలా బాధ కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎంపికైన రోజే రాజకీయాలకు స్వస్తి పలికానని తెలిపారు. ఇటీవల పదవీ విరమణ చేసిన తర్వాతనే తిరిగి స్వతంత్రుడినయ్యానన్నారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జీ ఎస్ఎల్‌ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తాను తల్లి ప్రేమను పొందలేకపోయానని తెలిపారు. తనకు 15 నెలల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయిందని చెప్పారు. తన అమ్మమ్మే పెంచిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీనే సర్వస్వమైందన్నారు. పార్టీ అన్ని విధాలుగా తనను ప్రోత్సహించి ఈ స్థాయికి తెచ్చిందన్నారు.

 ఆత్మీయ సమావేశంలో పాత  మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ‘రాజమండ్రిలో మిత్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పురప్రముఖులను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మిత్రులు కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు అభినందనీయం‘ అని ఆయన ట్వీట్  కూడా చేశారు. త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుసుకునే ఆలోచన ఉందన్నారు. తనకు మొదటినుంచీ ప్రజల మధ్య ఉండటం అలవాటని ఆయన తెలిపారు. అనంతరం దేశంలోనే తొలిసారిగా జీఎస్ ఎల్‌ వైద్య కళాశాలలో నెలకొల్పిన బయోటిక్‌ స్కిల్‌ ల్యాబ్‌ను వెంకయ్య ప్రారంభించారు.
Venkaiah Naidu
bjp
mother
vice president

More Telugu News