Hydrogen Balloon: తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. రెండు రోజులపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన రైతు!

Chinese man trapped aloft in hydrogen balloon for 2 days
  • చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్స్‌లో ఘటన
  • గాల్లో 320 కిలోమీటర్లు తిరిగిన వైనం
  • తిరుక్కుంటూ రష్యా సరిహద్దుల్లోకి
  • సెల్‌ఫోన్ ద్వారా సూచనలిచ్చి కిందికి దింపిన అధికారులు
ఓ రైతు వినూత్న ఆలోచన బెడిసికొట్టింది. ఫలితంగా రెండు రోజులపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాడు. దాదాపు 320 కిలోమీటర్లు తిరిగేశాడు. విషయం తెలిసిన అధికారులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు క్షేమంగా కిందికి దించారు. చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగిందీ ఘటన.  

అతడి పేరు హు.. హిలాంగ్ షియాంగ్ ప్రావిన్స్‌లోని ఫారెస్ట్ పార్క్‌లో పైన్ కాయలను కోసేందుకు ఇద్దరు రైతులు హైడ్రోజన్ బెలూన్‌ను ఉపయోగించారు. ఈ చెట్లు సన్నగా పొడవుగా ఉండడంతో కాయలు కోసేందుకు రైతులు కొందరు హైడ్రోజన్ బెలూన్లను ఉపయోగిస్తుంటారు. ఈ ప్రాంతం పైన్ చెట్లకు పెట్టింది పేరు. వంటల్లో వీటిని విరివిగా వాడుతుంటారు.

కాగా, హైడ్రోజన్ బెలూన్ సాయంతో పైకి ఎగిరి తాడు పట్టుకుని కాయలు కోస్తుండగా తాడు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో ఓ రైతు కిందకు దూకేయగా మరో రైతు మాత్రం ఆ పనిచేయలేకపోయాడు. దీంతో బెలూన్‌తోపాటే గాల్లోకి ఎగిరిపోయాడు. ఇక, అప్పటి నుంచి హు కోసం గాలింపు మొదలైంది. అలా ఎగిరిపోయిన రైతు దాదాపు 320 కిలోమీటర్లు ప్రయాణించి రష్యా సరిహద్దుకు చేరుకున్నాడు. 

మరోవైపు, అతడి కోసం గాలింపు మొదలు పెట్టిన అధికారులు తర్వాతి రోజు ఉదయం సెల్‌ఫోన్ ద్వారా హుతో మాట్లాడగలిగారు. కిందికి ఎలా రావాలో సూచనలు ఇచ్చారు. బెలూన్‌లోని గాలిని నెమ్మదిగా తగ్గించమని సూచించారు. వారు చెప్పినట్టే చేసిన హు ఎట్టకేలకు కిందికి దిగాడు. వెన్నులో నొప్పి తప్ప హు ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. గాల్లో ఎగురుతున్నంత సేపు తాడును పట్టుకుని వేలాడుతుండడం వల్లే అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పారు.
Hydrogen Balloon
China
Pine Nuts
Heilongjiang province

More Telugu News