Andhra Pradesh: ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు క్వాష్ పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ‌... త‌దుప‌రి విచార‌ణ 14కు వాయిదా

ap high court adjourns hearing of ab venkateswara rao quash petition
  • నిఘా ప‌రిక‌రాలు కొనుగోలు చేశారంటూ ఏబీవీపై ఏసీబీ కేసు
  • కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఏబీవీ పిటిష‌న్‌
  • విచార‌ణ‌ను ఈ నెల 14కు వాయిదా వేసిన కోర్టు
నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ త‌న‌పై న‌మోదైన కేసును కొట్టేయాలంటూ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు దాఖలు చేసిన క్వాష్ పిటిష‌న్‌పై గురువారం ఏపీ హైకోర్టులో విచార‌ణ సాగింది. ఈ విచార‌ణ సంద‌ర్భంగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌ర‌ఫు న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపించారు. అస‌లు నిఘా ప‌రిక‌రాలే కొన‌కుండా త‌న క్లయింట్‌పై కేసు ఎలా న‌మోదు చేస్తార‌ని ఏబీవీ త‌ర‌ఫు న్యాయవాది వాదించారు.

ఏబీవీ రిటైర్ అయ్యేదాకా ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఉండేలా ఈ కేసు న‌మోదు చేసినట్లుగా అనిపిస్తోంద‌ని కూడా ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. కేసు న‌మోదు చేసి ఏడాదిన్న‌ర అవుతున్నా ఏసీబీ అధికారులు విచార‌ణ పూర్తి చేయ‌లేద‌ని కోర్టుకు తెలిపారు. నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో ప‌లువురు వ్య‌క్తుల‌తో క‌లిసి ఏబీవీ కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నార‌న్న న్యాయ‌వాది... ఎఫ్ఐఆర్‌లో మాత్రం ఏబీవీ ఒక్క‌రి పేరునే ప్ర‌స్తావించార‌ని తెలిపారు. ఈ వాద‌న‌లు విన్న హైకోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఏబీవీ త‌ర‌ఫు వాద‌న‌ల‌ను ఈ నెల 14న కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh
AP ACB
AB Venkateswara Rao
AP High Court

More Telugu News